ల్యాగ్ అంటూనే బండి లాగేస్తోంది

ధనుష్ కొత్త హిందీ సినిమా తేరే ఇష్క్ మే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగానే బండి లాగేస్తోంది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు సోమవారంతో కలిపి ఇప్పటిదాకా డెబ్భై కోట్ల దగ్గరకు వెళ్లిందట. ఇది చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే తేరే మేరే ఇష్క్ మే తమిళంలో తిరస్కారానికి గురయ్యింది. తెలుగులో అమర కావ్యం పేరుతో కొంత లేట్ గా రిలీజైన సంగతి మన ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. కానీ నార్త్ లో మాత్రం మంచి వసూళ్లు రాబడుతోంది. రంఝానా కాంబో కావడంతో పాటు ధనుష్ ఇమేజ్, హీరోయిన్ కృతి సనన్ జనాన్ని టికెట్లు కొనేలా చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉత్తరాదిలో పెరుగుతున్న ఒక ట్రెండ్ ని గమనించాలి.

కొన్ని నెలల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన సైయారా ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో చూశాం. తేరే ఇష్క్ మే లాగా ఇది కూడా సీరియస్ లవ్ డ్రామా. చెప్పుకోదగ్గ ల్యాగ్ ఉంటుంది. కానీ ప్రేక్షకులు దాన్ని పట్టించుకోలేదు. కంటెంట్ లో ఎమోషన్ ఫీలైపోయి కలెక్షన్లు కురిపించారు. యష్ రాజ్ ఫిలింస్ కి వార్ 2 పీడకలగా నిలిస్తే సైయారా కామధేనువు అయ్యింది. ఇప్పుడు తేరే ఇష్క్ మే అదే మరోసారి రిపీట్ చేస్తోంది. అంటే ఇంటెన్స్ లవ్ స్టోరీస్ పట్ల హిందీ ఆడియన్స్ మక్కువ చూపిస్తున్నారనే క్లారిటీ దీని వల్ల వచ్చేసింది. ఈ లెక్కన మరిన్ని ఇలాంటి కథలు రిపీట్ కావొచ్చు.

ధనుష్ విషయానికి వస్తే కెరీర్ లో చాలా విచిత్రమైన పరిస్థితులు ఎదురుకుంటున్న వైనం గమనించవచ్చు. కుబేర తెలుగులో హిట్ అయితే తమిళంలో ఫ్లాప్ మూటగట్టుకుంది. ఇడ్లి కడాయిని కోలీవుడ్ లో కమర్షియల్ గా సేఫ్ చేస్తే మనోళ్లు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు తేరే ఇష్క్ మే హిందీలో వంద కోట్ల వైపు పరుగులు పెడుతుండగా తమిళ తెలుగు ఫ్యాన్స్ అవునా ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యిందని అనుకోవాల్సి వస్తోంది. ఏదైతేనేం ఏ భాషలో చేసినా తలొక చోట హిట్టు కొడుతున్న ధనుష్ ఒకపక్క నటన, ఇంకోవైపు డైరెక్షన్, నిర్మాణం మూడు బ్యాలన్స్ చేసుకుంటూ ప్రాజెక్టులు సెట్ చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్పే.