మలయాళ సినీ చరిత్రలో దృశ్యం సినిమా ఒక పెను సంచలనం. మోహన్ లాల్ హీరోగా థ్రిల్లర్ చిత్రాల స్పెషలిస్టు జీతు జోసెఫ్ రూపొందించిన చిత్రం.. పన్నెండేళ్ల ముందు విడుదలై అప్పటికి మలయాళ పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళం.. ఇలా పలు భాషల్లో విడుదలై అన్ని చోట్లా సూపర్ హిట్టయ్యాయి. చైనీస్, సింహళీస్ లాంఇ విదేశీ భాషల్లోనూ ఈ మూవీ రీమేక్ అయి విజయవంతం కావడం విశేషం.
దీనికి కొనసాగింపుగా మోహన్ లాల్- జీతు తీసిన దృశ్యం-2 కొవిడ్ టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై అద్భుత స్పందన తెచ్చుకుంది. దీంతో దృశ్యం-3 కోసం కొన్నేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. వారి నిరీక్షణకు తెరదించుతూ కొన్ని నెలల కిందటే మలయాళ వెర్షన్ అనౌన్స్ చేశారు. దాని షూటింగ్ కూడా మొదలైంది. సినిమా చివరి దశలో ఉంది. ఐతే ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ రూపొందించాలని అనుకున్నాడు జీతు జోసెఫ్.
ఐతే హిందీలో దృశ్యం, దృశ్యం-2 తీసిన దర్శకుడితనే అజయ్ దేవగణ్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కానీ మలయాళ వెర్షన్ రిలీజ్ కాకుండా హిందీ వెర్షన్ విడుదల చేయడానికి వీల్లేదని జీతు కండిషన్ పెట్టాడు. దీంతో ఆ వెర్షన్ షూట్ హోల్డ్‌లో పెట్టారు. తెలుగులో మాత్రం దృశ్యం-3ని జీతునే తీయాలనుకుంటున్నాడు. త్వరలోనే మలయాళ వెర్షన్ పూర్తి చేసి రాబోతున్నాడు జీతు. కానీ వెంకీ చేయడానికి రెడీగా ఉన్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీ.. ఇటీవలే త్రివిక్రమ్ సినిమాను మొదలుపెట్టాడు. త్రివిక్రమ్‌తో సినిమా కోసం వెంకీ ఎన్నో ఏళ్లు ఎదురు చూశాడు. ఎట్టకేలకు అది సాధ్యమైంది. ఆ సినిమా పూర్తి కావడానికి కొన్ని నెలలు సమయం పడుతుంది. అది చేస్తూ దృశ్యం-3 చేయడం సాధ్యమేనా.. అందుకు త్రివిక్రమ్ ఒప్పుకుంటాడా అన్నది ప్రశ్న.
మలయాళ దృశ్యం-3, తెలుగు దృశ్యం-3 ఒకేసారి రిలీజైతేనే బాగుంటుంది. ముందు అది వచ్చి, తెలుగు వెర్షన్ ఆలస్యమైతే ఇబ్బంది తప్పదు. దృశ్యం రిలీజైనపుడు పరిస్థితి వేరు. ఇప్పుడు వేరు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒరిజినల్ ద్వారా విశేషాలన్నీ బయటికి వచ్చేశాక తెలుగు వెర్షన్ చూడడానికి ఆసక్తి ఉండదు. ఇప్పటిదాకా దృశ్యం-3 తెలుగు వెర్షన్‌ను వెంకీ చేస్తున్నట్లు, ఫలానా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఏ రకమైన అధికారిక సమాచారం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు వెంకీ రెడీగా ఉన్నాడా.. అసలు ఆయనకీ చిత్రం చేసే ఉద్దేశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates