కీర్తి సురేష్ సినిమాకు ఇలాంటి ప‌రిస్థితా?

కెరీర్ ఆరంభంలో కీర్తి సురేష్‌ అంద‌రు హీరోయిన్ల‌లో ఒక‌రిలాగే కనిపించింది కానీ.. మ‌హాన‌టి త‌ర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. ఆ సినిమాతో గొప్ప న‌టిగా పేరు సంపాదించ‌డ‌మే కాక‌.. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ఆమె ఎదిగింది. మ‌హాన‌టి త‌ర్వాత ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవ‌కాశాలు.. ఇంకోవైపు స్టార్ల స‌ర‌స‌న క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఛాన్సుల‌కు లోటు లేక‌పోయింది. కీర్తి సినిమాల ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. కొన్నేళ్ల పాటు ఆమె క్రేజ్ మామూలుగా లేదు.

కానీ ఈ మధ్య కీర్తి కెరీర్‌లో గ్యాప్ వ‌చ్చింది. పైగా చివ‌రి కొన్ని చిత్రాలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాయి. దీనికి తోడు త‌న కొత్త సినిమా రివాల్వ‌ర్ రీటా అనుకున్న దాని కంటే ఆల‌స్యంగా రిలీజ‌వుతోంది. దానికి ప్ర‌మోష‌న్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. ఆ ప్ర‌భావం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర గ‌ట్టిగానే క‌నిపిస్తున్న‌ట్లుంది. ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్న ఈ సినిమాను ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న‌ట్లు లేరు. అడ్వాన్స్ బుకింగ్స్ క‌నీస స్థాయిలో కూడా జ‌ర‌గ‌ట్లేదు.

తెలుగులో రివాల్వ‌ర్ రీటాను త‌క్కువ థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్త‌న్నారు. హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్‌లో కీర్తి సినిమాకు త‌క్కువ షోలే ఇచ్చారు. ఆ ఇచ్చిన షోలకు కూడా బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. ప‌ట్టుమ‌ని ప‌ది టికెట్లు తెగిన థియేట‌ర్ ఒక్క‌టీ క‌నిపించ‌డం లేదు. హైద‌రాబాద్‌లో ఎలాంటి సినిమాకైనా ఓ మోస్త‌రు బుకింగ్స్ ఉండే థియేట‌ర్లుగా ఏఎంబీ సినిమాస్, ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌ల‌ను చెప్పుకోవ‌చ్చు. వాటిలో కూడా రివాల్వ‌ర్ రీటాకు క‌నీస స్థాయిలో కూడా టికెట్లు తెగ‌ట్లేదు.

ఇక మిగ‌తా థియేట‌ర్ల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌హాన‌టి త‌ర్వాత తెలుగులో కీర్తికి ద‌క్కిన ఏకైక హిట్ ద‌స‌రా మాత్ర‌మే. ఆ సినిమా త‌ర్వాత థియేట‌ర్ల‌లో రిలీజైన త‌న తెలుగు చిత్రం భోళా శంక‌ర్ మాత్ర‌మే. అది పెద్ద డిజాస్ట‌ర్ అయింది. డ‌బ్బింగ్ మూవీ నాయ‌కుడు, ఓటీటీ మూవీ ఉప్పుకప్పురంబు చిత్రాల‌తో ప‌ల‌క‌రించినా.. వాటిని ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న రివాల్వ‌ర్ రీటా మీద ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. క్రైమ్ కామెడీ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే బాగానే అనిపించింది. రేపు టాక్ బాగుంటే ఏమైనా సినిమా పుంజుకుంటుందేమో చూడాలి.