తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య, తన కెరీర్ పతాక స్థాయిలో ఉండగా చేసిన సినిమా.. అంజాన్ (తెలుగులో సికిందర్). రన్, సెండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా) లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన లింగుస్వామితో సూర్య జట్టు కట్టడంతో ‘అంజాన్’ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అప్పటికి సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించారు. ఆ సమయంలో టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఇందులో నటించడమే కాక బికినీలో కనిపించడంతో సినిమా హైప్ ఇంకా పెరిగింది.
కానీ రిలీజ్ రోజు సినిమా చూసిన సూర్య ఫ్యాన్స్ షాకైపోయారు. రొటీన్ రివెంజ్ డ్రామాతో అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశాడు లింగుస్వామి. దీంతో సినిమా డిజాస్టర్ అయింది. లింగుస్వామి పతనం ఈ చిత్రంతోనే మొదలైంది. ఆ తర్వాత ఆయన కోలుకోలేకపోయారు. ఐతే ఇలాంటి డిజాస్టర్ మూవీని ఇప్పుడు లింగుస్వామి రీ రిలీజ్ చేస్తున్నాడు. పైగా ఈసారి సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు.
‘అంజాన్’ సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ సరిగా ఎడిటింగ్ చేయలేకపోవడం వల్ల ఫెయిలైందని అంటున్నాడు లింగుస్వామి. రిలీజ్ విషయంలో తొందరపడడం, టైం లేకపోవడం వల్ల సరిగా ఎడిట్ చేయలేకపోయానని.. హడావుడిగా రిలీజ్ చేయాల్సి వచ్చిందని.. అందుకే ఫలితం తేడాగా వచ్చిందని లింగుస్వామి తెలిపాడు. ఆ సినిమా విషయంలో తాను పొరపాట్లు చేశానని అంగీకరిస్తానని.. కానీ ఆ మూవీని దారుణంగా ట్రోల్ చేశారని లింగుస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇప్పుడు తాను సినిమాను రీ ఎడిట్ చేశానని.. అరగంట సన్నివేశాలను తొలగించానని.. సూర్య మీదే ఫోకస్ చేశానని.. ఇప్పుడు సినిమా ఎంతో మెరుగ్గా తయారైందని లింగుస్వామి చెప్పాడు. రీ ఎడిట్ చేసిన సినిమాను సూర్య కుటుంబ సభ్యులకు కూడా చూపించానని.. వాళ్లకు ఎంతగానో నచ్చిందని.. అలాగే సూర్య అభిమానులకు కూడా ఎడిటెడ్ వెర్షన్ నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. శుక్రవారమే ‘అంజాన్’ తమిళంలో రీ రిలీజవుతోంది. అక్కడ స్పందనను బట్టి తెలుగులోనూ ‘సికిందర్’ను రీ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు లింగుస్వామి.
Gulte Telugu Telugu Political and Movie News Updates