తన పాత సినిమా పాటలను అనుమతి లేకుండా వాడుకోవడం గురించి నిర్మాణ సంస్థల మీద ఇళయరాజా చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఆ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి కోర్టు మెట్లు ఎక్కి నెట్ ఫ్లిక్స్ వెర్షన్ లో వాటిని మార్పించే దాకా వదల్లేదు. అఫ్కోర్స్ థియేటర్ రిలీజ్ లో అందరూ చూసేశారు, అది వేరే సంగతి. తాజాగా డ్యూడ్ విషయంలోనూ ఇది రిపీట్ అయ్యింది. పర్మిషన్లు లేకుండా సాంగ్స్ తీసుకున్నారు కాబట్టి వాటిని మార్చడమో లేదా బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని రాజా తరఫున లాయర్ చెన్నై హై కోర్టులో వాదించారు. అయితే జడ్జ్ ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అసలు ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉంటున్నారని, రిలీజ్ అయిపోయి ఓటిటిలో వచ్చే దాకా ఎందుకు ఆగుతున్నారని రాజా న్యాయవాదిని ప్రశ్నించారు. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇళయరాజా పాటలను జనం ఆస్వాదిస్తున్నప్పుడు ఇప్పుడెందుకు వద్దంటున్నారని అడిగారు. దీనికి బదులుగా పాటల కాపీ రైట్స్ తమ వద్ద ఉన్నాయని, అందుకే ఆక్షేపిస్తున్నామని లాయర్ చెప్పారు. మైత్రి తరఫున న్యాయవాది వాదన వినిపిస్తూ పాటల హక్కులు ఎకో కంపెనీ నుంచి సోనీ సంస్థ కొనుక్కుందని, తాము అనుమతులు, రాయల్టీలు కట్టే వాడుకున్నామని వివరించారు. విచారణ వాయిదా పడింది.
ఇటీవలే విడుదలైన తమిళ సినిమా మాస్క్ నిర్మాతలు ఇలాంటి ఇబ్బంది రాకుండా ఇళయరాజాను ముందే కలిసి అయన పర్మిషన్ తో ఏకంగా ఆరు సాంగ్స్ వాడుకున్నారు. అన్నీ క్లాసిక్ చార్ట్ బస్టర్స్ కావడం గమనార్హం. మాస్క్ పెద్దగా మేజిక్ చేయడం లేదు కానీ కెవిన్ హీరో కావడంతో ఉన్నంతలో ఏదో నెట్టుకొస్తోంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంలో హీరో ఇంట్రోకి వాడింది కూడా ఇళయరాజా పాటే. కాకపోతే ముందే అనుమతి తీసుకోవడం వల్ల సమస్య రాలేదట. ఏది ఏమైనా ఇసైజ్ఞాని పాటలు వాడుకునే విషయంలో ఇకనైనా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఈ కాపీ రైట్ చట్టాలను హక్కులను బాగా చదివి ప్రొసీడ్ కావడం బెటర్.
Gulte Telugu Telugu Political and Movie News Updates