వాసు-వంశీ… టాలీవుడ్ గోల్డెన్ హ్యాండ్స్

మంచి కంటెంట్‌తో చిన్న సినిమాలు తీసి.. రిలీజ్ విషయంలో సరైన బ్యాకప్ కోసం చూస్తున్న ఫిలిం మేకర్స్ చాలామందే ఉంటారు. ఇలాంటి వాళ్లకు పేరున్న నిర్మాణ సంస్థలు అండగా నిలిచి వాటిని రిలీజ్ చేయడం.. తద్వారా లాభాలు పంచుకోవడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. గతంలో దిల్ రాజు ఇలా అనేక చిత్రాలకు అండగా నిలిచి.. తాను కూడా ప్రయోజనం పొందారు. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్.. ఇలా పేరున్న నిర్మాణ సంస్థలు ఇలా చిన్న చిత్రాలను టేకప్ చేసినవే.

ఐతే ఇప్పుడు ఇద్దరు యువ నిర్మాతలు చిన్న సినిమాలకు సపోర్ట్ ఇచ్చి, ఘన విజయాలు అందుకోవడం ద్వారా తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్లే.. బన్నీ వాసు, వంశీ నందిపాటి. ఎన్నో ఏళ్లుగా ‘గీతా ఆర్ట్స్’కు వెన్నెముకలా నిలుస్తూ వచ్చిన బన్నీ వాసు.. తన అభిరుచికి తగ్గ చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు, రిలీజ్ చేసేందుకు సొంతంగా ‘బన్నీ వాస్ వర్క్స్’ పేరిట కొత్త బేనర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక వంశీ నందిపాటి సైతం ‘మా ఊరి పొలిమేర-2’ సహా కొన్ని సినిమాలతో తనకంటూ ఒక పేరు సంపాదించాడు.

వీళ్లిద్దరూ కలిసి రెండు నెలల కిందట ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న సినిమాను రిలీజ్ చేశారు. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్.. ఈటీవీ విన్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయగా.. ఆ చిత్రాన్ని వాసు, వంశీ కలిసి రిలీజ్ చేశారు. ఆ చిత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో భాగస్వాములైన అందరికీ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈటీవీ విన్ వాళ్లు ప్రొడ్యూస్ చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ని కూడా వాసు-వంశీలే టేకప్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కొత్త వాళ్లు, దర్శకుడూ కొత్తవాడే. 

ఐతే మంచి పాట, ట్రైలర్‌‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడమే కాక.. పబ్లిసిటీ కూడా గట్టిగా చేసి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బడ్జెట్-రాబడి లెక్కల్లో చూస్తే ఇది కూడా బ్లాక్‌బస్టర్ అనే చెప్పాలి. వీకెండ్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయి బయ్యర్లకు లాభాలు అందిస్తోంది. రెండు నెలల వ్యవధిలో ఇలా రెండు చిన్న చిత్రాలను రిలీజ్ చేసి బ్లాక్ ‌బస్టర్లు కొట్టడంతో వాసు-వంశీలను గోల్డెన్ హ్యాండ్స్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.