ఈసారి తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్లో కంటెస్టెంట్ల జాబితా బయటికి వచ్చినపుడు టైటిల్ రేసులో ఉండదగ్గ వాళ్లలో నోయల్ ఒకడిగా భావించారు. హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే జనాలకు అతను బాగా తెలుసు. ఆరంభ ఎపిసోడ్లలో అతడి నడవడిక కూడా ఆకట్టుకుంది. కానీ అనూహ్యంగా అనారోగ్య కారణాలతో అతను హౌస్ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత అతను కోలుకున్నాక ‘బిగ్ బాస్’ అభిమానులతో చిట్‌చాట్‌లు చేశాడు. ఇంకా షో అయిపోలేదు అనడం ద్వారా తాను హౌస్‌లోకి తిరిగి రాబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చాడు. దీంతో నోయల్ ఫ్యాన్స్ అతడి రీఎంట్రీ కోసం ఎదురు చూశారు. కానీ నోయల్ మళ్లీ రావడం లాంటిదేమీ జరగలేదు. ఐతే షో పట్ల ఇంతకుముందు అతను ఎలాంటి వ్యతిరేకత చూపించింది లేదు కాబట్టి.. తన నిష్క్రమణ తర్వాత షోను ఫాలో అవుతుంటాడనే అనుకున్నారంతా.
కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోయల్ మాట్లాడుతూ తాను ‘బిగ్ బాస్’ చూడ్డమే మానేశానని చెప్పడం విశేషం. తాను అసలు ‘బిగ్ బాస్’కు ఎందుకు వెళ్లానో అర్థం కావడం లేదని, ఆ షో వల్ల తనకెలాంటి ఉపయోగం లేకపోయిందని, ఈ షో మనకు అవసరం లేదనే భావన కలిగిందని నోయల్ అన్నాడు. తాను హౌస్ నుంచి బయటికి వచ్చేశాక షో పట్ల ఆసక్తి తగ్గిపోయిందని, దీంతో రోజువారీ ఎపిసోడ్లు చూడటం మానేశానని నోయల్ చెప్పాడు.
ఇక హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు బెస్ట్, టైటిల్ ఎవరు గెలుస్తారు అని అడిగితే అతను సూటిగా సమాధానం ఇవ్వలేదు. హౌస్‌లో ఉన్న వాళ్లందరూ మంచోళ్లే అని.. ఐతే తన మద్దతు మాత్రం అభిజిత్, హారికలకే అని చెప్పాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన నోయల్.. సినిమాల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చాలానే చేశాడు. వాటిలో కుమారి 21 ఎఫ్, నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్ లాంటి సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates