డ్రాగన్ మాట మీద ఉండటం కష్టమే

జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. టీమ్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఇంతకన్నా మంచి పేరు దొరికే సూచనలు కనిపించడం లేదు. ముందు 2026 సంక్రాంతి రిలీజ్ అనుకుని తర్వాత వాయిదా వేసుకుని జూన్ 25కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడా డేట్ చేరుకోవడం కూడా అనుమానంగానే ఉందట. డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే చేతిలో ఉన్న సమయం కేవలం ఆరు నెలలు. మాములుగా ప్రశాంత్ నీల్ ఇంతకంటే ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడక్షన్ కు తీసుకుంటారు. కెజిఎఫ్ కు అదే జరిగింది.

అలాంటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు, మార్కెటింగ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు వగైరా తక్కువ సమయంలో చేయడం అసాధ్యం. తారక్ వరకు షూటింగ్ మొత్తం అయిపోవడానికి మార్చి అవ్వొచ్చట. కానీ నిర్మాణంతర కార్యక్రమాలకు ఎక్కువ సమయం అవసరం కావడంతో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోవచ్చని, సమ్మర్ దాటిపోతుందని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ చేతిలో వేసవి కోసం చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఫౌజీలలో ఒకటి సమ్మర్ కే వస్తుంది. ఒకవేళ డ్రాగన్ డ్రాప్ అయితే దసరా లేదా దీపావళి స్లాట్ చూసుకోవాలి. అది కూడా ఫౌజీతో క్లాష్ లేకుండా ప్లాన్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద వ్యవహారమే.

దేవర తర్వాత సోలో హీరోగా చేస్తున్న సినిమా కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ డ్రాగన్ విషయంలో చాలా జాగ్రత్తగా నిష్ఠగా ఉన్నాడు. వార్ 2 మాములు గాయం చేయలేదు. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన గుర్తింపు మీద ప్రభావం చూపించింది. ఇప్పుడు దాన్ని తిరిగి పొందాలంటే డ్రాగన్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వాలి. పర్ఫెక్షన్ కోసం తపించే ప్రశాంత్ నీల్ నిజంగా ఆరేడు నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుంటాడా అనేది డౌట్ గానే ఉంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో కొంత భాగం రీ షూట్ కూడా చేశారట. జూనియర్, నీల్ ఇద్దరిదీ రాజీ పడే మనస్తత్వం కాకపోవడంతో ఇలాంటివి తప్పవు.