ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాలకు యధాతథంగా ఒరిజినల్ టైటిల్స్ పెట్టడం అలవాటుగా మార్చేశారు. రజినీకాంత్ వెట్టయన్ నుంచి విజయ్ ఆంటోనీ మార్గన్ దాకా అందరిదీ ఇదే తంతు. నిర్మాతలను అడిగితే ప్యాన్ ఇండియా కాబట్టి ఒకే పేరు ఉండాలని ఏదో మొక్కుబడి సమర్ధింపు చేస్తారు కానీ నిజానికిది భాష పట్ల నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. అయితే కార్తీ కొత్త మూవీకి అన్నగారు వస్తారు అని నామకరణం చేయడం లాంగ్వేజ్ లవర్స్ చెవుల్లో పాలు పోసినట్టవుతోంది. వా వాతియర్ పేరుతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. తనకు జోడిగా కృతి శెట్టి నటించింది.
అన్నగారు వస్తారు టైటిల్ లో తెలుగుదనం ఉట్ఠిపడుతోంది. మాస్ కి త్వరగా దగ్గరయ్యే పదం ఇది. చిరంజీవి అన్నయ్య, రాజశేఖర్ మా అన్నయ్య – అన్న, బాలకృష్ణ పెద్దన్నయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్లు కనిపిస్తాయి. కార్తీ కూడా అదే దారి పట్టాడు. నిజానికి అన్నగారు వస్తారు షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. రెండేళ్లకు పైగా నిర్మాణం జరిగింది. టీజె జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. మొన్నటి దాకా చెన్నై వర్గాలు ఇది డిసెంబర్ లో రిలీజ్ కాదనే అనుమానం వ్యక్తం చేశాయి. టీమ్ మాత్రం అదే నెలలో రావడం పక్కాని కొత్త పోస్టర్ లో వేసింది.
కాకపోతే డేట్ అందులో ప్రస్తావించలేదు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన అన్నగారు వస్తారులో కార్తీ సీరియస్ గా కాకుండా ఫన్ పోలీస్ క్యారెక్టర్ చేశాడు. ఇంకా చెప్పాలంటే విక్రమార్కుడు అత్తిలి సత్తిబాబు ఖాకీ బట్టలు వేసుకున్న తర్వాత ఏం జరిగిందో తీసుకుని దాన్నే ఫుల్ లెన్త్ స్టోరీగా మార్చారని అంతర్గత సమాచారం. కార్తీకి అర్జెంట్ గా హిట్టు కావాలి. అన్నగారు వస్తారు సక్సెస్ అయితే నెక్స్ట్ లైన్ లో ఉన్న సర్దార్ 2కి బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుంది. ఖైదీ 2ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడప్పుడే తీసేలా లేకపోవడంతో అభిమానులు, మూవీ లవర్స్ ఎదురు చూడటం మానేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates