చికిరి చికిరి తెచ్చి పెట్టిన సమస్య

పెద్ది నుంచి చికిరి చికిరి సాంగ్ వచ్చి పది రోజులు దాటిపోయింది. అయినా దాని తాలూకు వైబ్స్ ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రీల్స్ బ్యాచ్ దీని మీద ఎన్ని లక్షల వీడియోలు చేసిందో లెక్క చెప్పడం కష్టం. అంతగా చొచ్చుకుపోయిన వైనం ఇన్స్ టా చూస్తే గమనించవచ్చు. ఏఆర్ రెహమాన్ నుంచి ఇంత పెద్ద చార్ట్ బస్టర్ ఆయన వీరాభిమానులు సైతం ఊహించలేదు. ముఖ్యంగా హిందీ వెర్షన్ తెచ్చుకున్న రీచ్ చూసి నిర్మాణ సంస్థ, దర్శకుడు బుచ్చిబాబు ఆశ్చర్యపోతున్నారు. ఇదే ఊపు మిగిలిన పాటలు, ట్రైలర్ కనక తీసుకురాగలిగితే ఉత్తరాది మార్కెట్ లో భారీ డిమాండ్ ఏర్పడుతుంది.

అయితే చికిరి చిక్కిరి తెచ్చి పెట్టిన ప్రధాన సమస్య ఒకటుంది. దీని తర్వాత కొత్త సినిమాల లిరికల్ వీడియోలు ఏవి రిలీజైనా చికిరి స్థాయిలో ఉన్నాయని అనిపించుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ఆంధ్రకింగ్ తాలూకాలోని ఫ్యాన్ సాంగ్, అఖండ 2 నుంచి వచ్చిన రెండు పాటలు వేటికవే బాగానే ఉన్నా రీచ్ పరంగా నెమ్మదిగా ఉన్న వైనం స్పష్టం. ఒకవేళ పెద్ది పాట కనక మేజిక్ చేయకపోయి ఉంటే మిగిలిన వాటి రీచ్ ఎక్కువగా ఉండేదన్న మాట వాస్తవం. ఈ మధ్య ఒక సాంగ్ రేంజుని కొలవాలంటే యూట్యూబ్ వ్యూస్ తో పాటు రీల్స్ సంఖ్య కొలమానంగా మారిపోయింది. ఇక్కడ చికిరి చికిరి డామినేషన్ కనిపిస్తోంది.

ఇంకా దీని వేడి చల్లారకుండా రెండో పాట విడుదల చేసేందుకు టీమ్ రెడీ అవుతోందని సమాచారం. అయితే మన శంకరవరప్రసాద్ గారు కంటెంట్ తో క్లాష్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. డిసెంబర్ చివరి వారంలో పెద్ది సెకండ్ సాంగ్ లాంచ్ గురించి ఆలోచిస్తున్నారు కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. ఏది ఏమైనా చికిరి చికిరి హ్యాంగోవర్ మాత్రం మాములుగా లేదు. అన్నట్టు గేమ్ చేంజర్ లో శంకర్ అంతటి లెజెండరీ దర్శకుడు వాడుకోలేకపోయిన రామ్ చరణ్ ఎనర్జీని బుచ్చిబాబు లాంటి రెండో సినిమా డైరెక్టర్ ఈ స్థాయిలో రాబట్టుకోవడం మాములు విశేషం కాదు.