అఖండ‌-2 ఇంట‌ర్వెల్‌కే 500 రూపాయ‌లు

ఈ ఏడాది మిగిలిన నెల‌న్న‌ర రోజుల్లో టాలీవుడ్ నుంచి అత్య‌ధిక అంచ‌నాల‌తో రాబోతున్న సినిమా.. అఖండ‌-2. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గ‌ల‌ద‌నే అంచ‌నాలున్నాయి. టీం కూడా ఆ దిశ‌గానే అఖండ‌-2ను ప్రమోట్ చేస్తోంది. ముంబ‌యి వేదిక‌గా ఒక పెద్ద ఈవెంట్ నిర్వ‌హించి ఈ మూవీ నుంచి తాండ‌వం పాట‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. దీంతో పాటుగా ఒక స్పెష‌ల్ డైలాగ్ ప్రోమోను కూడా ఎక్స్‌క్లూజివ్‌గా హిందీ ప్రేక్ష‌కుల‌కు అందించారు. 

ఈ పాట‌కు, ఆ డైలాగ్‌కు మంచి రెస్పాన్సే వ‌చ్చింది. ఇదిలా ఉంటే సాంగ్ లాంచ్ ఈవెంట్లో ప్ర‌సంగాలు కూడా ఆస‌క్తిక‌రంగా సాగాయి. బాల‌య్య హిందీలోనే నాన్ స్టాప్ స్పీచ్ ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ.. అఖండ‌-2 సినిమా కాదు, భార‌త దేశ‌పు ఆత్మ అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్లో త‌మ‌న్ స్పీచ్ అన్నిటికంటే హైలైట్‌గా నిలిచింది.

అఖండ‌-2 ఇంట‌ర్వెల్ గురించి ఒక రేంజిలో ఎలివేష‌న్ ఇచ్చాడు త‌మ‌న్. ఈ సినిమా కోసం పెట్టే 500 రూపాయ‌ల‌కు ఆ ఒక్క ఇంట‌ర్వెలే గిట్టుబాటు చేస్తుంద‌ని అత‌న‌న్నాడు. బోయ‌పాటి శ్రీను ఆ ఎపిసోడ్‌ను అంత గొప్ప‌గా తీసిన‌ట్లు త‌మ‌న్ చెప్పాడు. ఇంటర్వెల్ చూసి ఇక చాల‌నుకుని థియేట‌ర్ల నుంచి బ‌య‌టికి వ‌చ్చేయొచ్చ‌ని త‌మ‌న్ చెప్పాడు. బోయ‌పాటి ఎంతో గొప్ప‌గా సినిమా తీస్తే.. బాల‌య్య అంత గొప్ప‌గా న‌టించాడ‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే తాను కూడా సంగీతం అందించాన‌ని త‌మ‌న్ చెప్పాడు. 

అఖండ‌-2 ఫ‌స్టాఫ్ వ‌ర్క్ పూర్తి చేసేస‌రికే త‌న ద‌గ్గ‌ర ఉన్న సంగీతం అంతా అయిపోయింద‌ని.. ఆ త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవాల్సి వ‌చ్చింద‌ని అత‌ను చెప్పాడు. అఖండ సినిమా అయ్యాక పార్ట్-2 తీయ‌డానికి ఏం క‌థ ఉంద‌ని చాలామంది అనుకున్నార‌ని.. కానీ ఐదు భాగాలు తీయ‌గ‌ల కంటెంట్ ఈ క‌థ‌లో ఉంద‌ని.. అన్ని సినిమాల‌కూ బాల‌య్య రెడీగా ఉంటార‌ని.. శివుడి గురించి ఎంతైనా చెప్పొచ్చ‌ని త‌మ‌న్ వ్యాఖ్యానించాడు. అఖండ‌-2 డిసెంబ‌రు 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.