జాన్వి ల‌వ్ స్టోరీ… ఫుల్ క్లారిటీ?

లెజెండ‌రీ హీరోయిన్ శ్రీదేవి ఘ‌న వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ.. ఇండియన్ సినిమాలో త‌న‌దైన ముద్ర వేసేందుకు గ‌ట్టి ప్ర‌యత్న‌మే చేస్తోంది జాన్వి క‌పూర్. బాలీవుడ్లో ఇప్ప‌టికే అర‌డ‌జ‌నుకు పైగా సినిమాల్లో న‌టించిన ఆమె.. తెలుగులో దేవ‌ర‌తో మురిపించింది. ఇప్పుడు పెద్ది లాంటి క్రేజీ ప్రాజెక్టులో న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి చికిరి పాట నేష‌న‌ల్ వైడ్ ట్రెండ్ అవుతున్న టైంలోనే ఆమె వ్య‌క్తిగ‌త జీవితం గురించి చ‌ర్చ మొద‌లైంది.

జాన్వి చాన్నాళ్ల నుంచి శిఖ‌ర్ ప‌హారియా అనే వ్యాపార‌వేత్త‌తో ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌ను కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మ‌న‌వ‌డు కావ‌డం విశేషం. శిఖ‌ర్ సోద‌రుడు వీర్ ప‌హారియా సినీ న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. శిఖ‌ర్ మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ బిజినెస్ మీద ఫోక‌స్ పెట్టాడు. అత‌ను పోలో ప్లేయ‌ర్ కూడా. గ‌తంలో కొన్నిసార్లు జాన్వితో క‌లిసి స‌న్నిహితంగా క‌నిపించాడు శిఖ‌ర్.

ఐతే ఈ మ‌ధ్య జాన్వితో శిఖ‌ర్ బంధం బాగానే బ‌ల‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా జాన్వి తండ్రి బోనీ క‌పూర్ 70వ పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. క‌పూర్ కుటుంబానికి చెందిన ముఖ్యులంద‌రూ ఈ వేడుక‌లో పాల్గొన్నారు. అలాగే కొంద‌రు అతిథులూ వారికి తోడ‌య్యారు. ఆ అతిథుల్లో శిఖ‌ర్ ప‌హారియా కూడా ఉన్నాడు. అత‌నేదో గెస్టులా వ‌చ్చిన‌ట్లు కాకుండా కుటుంబ స‌భ్యుడిలాగే ఆ వేడుక‌లో క‌లిసి పోయాడు. జాన్వితో క‌లిసి చాలా స‌న్నిహితంగా ఉన్న పొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి.

కుటుంబ స‌భ్యులు క‌లిసి ఉన్న ఫొటోల్లో శిఖ‌ర్ ఉండ‌డం.. ఈ ఫొటోల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం.. దీన్ని బ‌ట్టి చూస్తే జాన్వి-శిఖ‌ర్ బంధం గురించి దాచిపెట్టే ఉద్దేశ‌మేమీ క‌పూర్ కుటుంబానికి లేద‌ని అర్థ‌మ‌వుతోంది. జాన్వి కెరీర్ ఊపందుకుంటున్న ద‌శ‌లో రిలేష‌న్‌షిప్ గురించి ఇలా బ‌య‌ట‌పెట్టేయ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగించే విశేష‌మే. ఇదేమీ టైంపాస్ డేటింగ్ వ్య‌వ‌హారంలా కూడా ఏమీ లేదు. త్వ‌ర‌లోనే ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నా ఆశ్చ‌ర్యం లేదు. మ‌రి ఆ ప్ర‌క‌ట‌న ఎప్పుడొస్తుందో చూడాలి.