#TFIFailedhere.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్లకు ఈ హ్యాష్ ట్యాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్ ఉండి కూడా సరిగా ఆడని సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. దీన్ని వాడుతుంటారు. ‘ఖలేజా’ సహా ఎన్నో సినిమాల విషయంలో అభిమానులు ఇలా ఫీలవుతుంటారు. దీని మీద బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుంటాయి. ఐతే ఇప్పుడు ఓ కొత్త సినిమా విషయంలో ఈ హ్యాష్ ట్యాగ్ వాడాల్సిన అవసరం కనిపిస్తోందన్నది నెటిజన్ల మాట. ఆ చిత్రమే.. ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో.
మసూద సహా కొన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించిన తిరు వీర్ హీరోగా నటించిన సినిమా ఇది. గత వారం మరో మూడు చిత్రాలతో ఈ మూవీ పోటీ పడింది. వీకెండ్లో కంటెంట్, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇదే బెస్ట్ మూవీ అనడంలో సందేహం లేదు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా విషయం ఉన్న సినిమా అయినా.. దాని కంటే ఇది బెస్ట్ ఎంటర్టైనర్ అన్నది ఈ రెండు చిత్రాలూ చూసిన వాళ్లు చెప్పిన మాట. ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.
కానీ ఈ పేరుతో ఒక సినిమా రిలీజవుతున్నట్లే జనాలకు పెద్దగా తెలియలేదు. రిలీజ్ తర్వాత కూడా పబ్లిసిటీ అనుకున్నంతగా లేకపోయింది. జనం ఆశించిన స్థాయిలో థియేటర్లకు రాలేదు. మొత్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయం సాధించిన దాఖలాలు కనిపించడం లేదు. ఉన్న కంటెంట్‌కు పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అది. కానీ రకరకాల కారణాలు తోడై సినిమా పెద్దగా ఆడకుండానే థియేట్రికల్ రన్ ముగించేలా ఉంది. రేప్పొద్దున ఓటీటీలోకి వచ్చాక ఇలాంటి సినిమా ఎందుకు ఆడలేదో అని జనం ఆశ్చర్యపోవడం.. టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని ట్రెండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates