‘శివ’తో మొదలుపెట్టి దర్శకుడిగా తొలి 15 ఏళ్లలో రామ్ గోపాల్ వర్మ ఎంత గొప్ప సినిమాలు తీశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రంగీలా, రాత్, సత్య, కంపెనీ, సర్కార్.. ఇలా వర్మ అప్పట్లో తీసిన ప్రతి సినిమా ట్రెండ్ సెట్టరే. కానీ కెరీర్లో ద్వితీయార్ధంలో ఆయన ఎంత పేలవమైన సినిమాలు తీశారో.. ట్విట్టర్ వేదికగా విపరీత ప్రవర్తనతో వ్యక్తిగా కూడా ఎంత పతనం అయిపోయారో తెలిసిందే. రాజకీయ మకిలి కూడా అంటించుకున్నాక వర్మ పేరు పూర్తిగా దెబ్బ తినేసింది.
కానీ గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక వర్మకు జ్ఞానోదయం అయింది. ఆయన మాటతీరులో అప్పట్నుంచి మార్పు కనిపిస్తోంది. రాజకీయాలకు, చెత్త సినిమాలకు స్వస్తి పలికి.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ‘పోలీస్ స్టేషన్లో దయ్యం’ పేరుతో ఆయన తీస్తున్న సినిమా మీద ఇంకా సినీ ప్రియుల్లో నమ్మకం అయితే కుదరట్లేదు.
కానీ తనేంటో ఆ సినిమాలో చూస్తారని అంటున్నాడు ఆర్జీవీ. తన డెబ్యూ మూవీ ‘శివ’ రీ రిలీజ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వర్మకు.. కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘‘మీ కెరీర్ రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నట్లు మాకనిపిస్తోంది’’.. అంటూ ఒక జర్నలిస్టు ప్రస్తావిస్తే.. ‘‘రాంగ్ ట్రాక్‌లోకి వెళ్తుంది అనిపించడం కాదు. రాంగ్ ట్రాక్‌లోకి వెళ్లింది’’ అని నిజాయితీగా స్టేట్మెంట్ ఇచ్చాడు.
వర్మ అంటే వోడ్కా అని కౌంటర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది, మీరేమైనా రియలైజ్ అయ్యారా అని అడిగితే.. ‘‘నా తర్వాతి సినిమాలో చూస్తారు’’ అంటూ వర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘పోలీస్ స్టేషన్లో దెయ్యం’ సినిమాను సిన్సియర్‌గా తీశానని.. ఇది తనేంటో రుజువు చేస్తుందని వర్మ చెప్పకనే చెబుతున్నాడు. ఐతే మనోజ్ బాజ్‌పేయి, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, కాన్సెప్ట్ అయితే అంత కొత్తగా, గొప్పగా అనిపించడం లేదు. మరి ఈ లెజెండరీ డైరెక్టర్ ఈ చిత్రంతో నిజంగానే ‘వర్మ ఈజ్ బ్యాక్’ అనిపిస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates