ఓవైపు రాధేశ్యామ్ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ఆదిపురుష్‌తో పాటు నాగ్ అశ్విన్ సినిమా రెండూ కూడా భారీ ప్రాజెక్టులే. ప్రభాస్ ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే రెండు మూడేళ్ల సమయం పట్టేలా ఉంది.
ఇంతలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా కమిటయ్యాడని, దీని గురించే హోంబలె ఫిలిమ్స్ ప్రకటన చేయబోతోందని వార్తలొస్తున్నాయి. ఐతే ప్రభాస్‌కు ఇప్పుడింత తొందరేంటి అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఐతే ప్రశాంత్ ప్రపోజల్ నచ్చే అతను ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రశాంత్-ప్రభాస్ కలయికలో రాబోయేది కొత్త కథ కాదట. అదొక రీమేక్ అని వార్తలొస్తున్నాయి.
ప్రశాంత్ ఆరేళ్ల కిందట ఉగ్రం అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శ్రీ మురళి అనే చిన్న హీరోతో ప్రశాంత్ తీసిన ఆ సినిమా కన్నడ నాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో సాగే ఆ చిత్రం చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. కన్నడలో రొడ్డకొట్టుడు సినిమాల మధ్య అది విభిన్న ప్రయత్నంలో ప్రశంసలందుకుంది.
ఈ సినిమాతో వచ్చిన పేరు వల్లే కేజీఎఫ్ లాంటి భారీ సినిమా తీసే అవకాశం దక్కింది ప్రశాంత్‌కు. ఇప్పుడు ఈ కథను ప్రభాస్‌తో భారీ స్థాయిలో తీయాలన్నది ప్రశాంత్ ప్రణాళిక అట. ప్రభాస్‌తో సినిమా అంటే దాని స్కేలే మారిపోతుంది. మూల కథ తీసుకుని దాన్ని పెద్ద రేంజిలో తీసి సినిమాకు కొత్త కలర్ ఇవ్వాలన్నది ప్రశాంత్ ప్రయత్నంలా ఉంది.
కథ రెడీ కాబట్టి తనకు వీలున్నపుడు సినిమా చేద్దామని, ఇది తనకు భిన్నమైన సినిమా అవుతుందని ప్రభాస్ భావిస్తున్నాడట. ఇంతకుముందు చివరగా ప్రభాస్ చేసిన రీమేక్ మూవీ యోగి కూడా కన్నడ నుంచి వచ్చిందే కావడం విశేషం.