విజయ్‌నే పెళ్లి చేసుకుంటా-రష్మిక

కొన్ని వారాల కిందట టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన విషయం.. విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింపుల్‌గా ఈ వేడుకను పూర్తి చేసింది ఈ జంట. ఐతే ఈ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఆ కబురు కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.

విజయ్ అయితే ఎక్కడా ఇంత వరకు ఓపెన్ కాలేదు. రష్మిక మందన్నా.. జగపతి బాబు నిర్వహించే షోలో పరోక్షంగా నిశ్చితార్థం గురించి మాట్లాడింది. తన చేతికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం గురించి మాట్లాడుతూ.. అది చాలా స్పెషల్ అని చెప్పింది. ఇప్పుడు ఒక టీవీ షోలో ఆమె నోటి నుంచి ‘విజయ్‌ని పెళ్లి చేసుకుంటా’ అనే మాట రావడం విశేషం.

ఈ షోలో ఒక అభిమాని మీరు కలిసి పని చేసిన నటుల్లో ఎవరితో ఎలాంటి రిలేషన్‌షిప్ కోరుకుంటారు అని అడిగితే.. రష్మిక సమాధానం ఇస్తూ యానిమేషన్ క్యారెక్టర్ నరుటోతో తాను డేటింగ్ చేయాలని అనుకుంటా అని చెప్పింది. దానికి కొనసాగింపుగా.. ‘‘విజయ్‌ని పెళ్లి చేసుకుంటా’’ అనడంతో అందరూ గట్టిగా అరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉంది. విజయ్, రష్మిక పెళ్లి కోసం ఎక్కువ సమయం ఏమీ తీసుకోరని వార్తలు వస్తున్నాయి.

ఫిబ్రవరిలో వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చు. కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’తో కథానాయికగా పరిచయం అయిన రష్మిక.. తర్వాత హిట్ మూవీ ‘ఛలో’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండతో చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ అయి ఆమె కెరీర్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. విజయ్‌తో తర్వాత ఆమె ‘డియర్ కామ్రేడ్’లోనూ నటించింది. అప్పుడే వాళ్లిద్దరి మధ్య రిలేషన్‌షిప్ మొదలైనట్లు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి వైపు అడుగులు వేస్తోంది.