పరిశ్రమలో అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు ఎలా తడుతుందో చెప్పలేం. రజనీకాంత్ తో పని చేయడానికి ఇప్పటి తరం దర్శకులు ఎంతగా తహతహలాడుతున్నారో చూస్తున్నాం. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, పా రంజిత్ లాంటి వాళ్ళు తలైవర్ ని వీలైనంత గొప్పగా ప్రెజెంట్ చేయడంలో తమ వంతు కృషి చేశారు, చేస్తున్నారు. వీళ్ళ దెబ్బకు రజని లాంటి వాళ్ళు సీనియర్లను దూరం పెడుతున్నారు. అయితే అనూహ్యంగా సుందర్ సికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా తలైవర్ అభిమానులని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇవాళ అధికారిక ప్రకటన వచ్చింది కానీ రెండు వారాల క్రితమే ఇది చెన్నై వర్గాల్లో లీకైయ్యింది.
ఒకప్పుడేమో కానీ సుందర్ సి ప్రస్తుతం ఫామ్ లో లేరు. అరణ్మయి దెయ్యాల సిరీస్ తీసుకుంటూ ఏదో కాలం గడిపేస్తున్నారు. కమర్షియల్ గా వర్కౌట్ అవుతుండటంతో నిర్మాతలు ముందుకొస్తున్నారు. విశాల్ తో తీసిన మదగజరాజ దశాబ్దం తర్వాత విడుదలకు నోచుకున్నా డబ్బులు తేవడం ఆయనకు దక్కిన గొప్ప రిలీఫ్. అడపాదడపా నటుడిగా కూడా కనిపిస్తున్న సుందర్ సి కొన్నేళ్ల క్రితం బాహుబలిని మించే రీతిలో సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ని ప్రకటించారు. ఆ తర్వాత అది షూటింగ్ మొదలవ్వకుండానే అటకెక్కింది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న సుందర్ సికి రజని ఆఫర్ ఇవ్వడం చాలా గొప్ప విషయం.
కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమా జానర్ లాంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు. సుందర్ సి గతంలో రజనిని డైరెక్ట్ చేశారు. వీళ్ళ కాంబోలో 1997లో వచ్చిన అరుణాచలం మాములు బ్లాక్ బస్టర్ కాదు. రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత పలుమార్లు అనుకున్నా వీళ్ళ కాంబో రిపీట్ కాలేదు. తర్వాత సుందర్ సి గ్రాఫ్ క్రమంగా డౌన్ అవుతూ వెళ్ళింది. అగ్ర హీరోలు ఇచ్చిన ఛాన్సులను సరిగా ఉపయోగించుకోలేకపోయారు. 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ రజనికి యాక్షన్ చెప్పే అదృష్టం దక్కడం గొప్పే. ప్రస్తుతం ఈయన నయనతారతో మూకుతి అమ్మన్ (అమ్మోరు తల్లి 2) సీక్వెల్ తీస్తున్నారు. ఇది కూడా భారీ బడ్జెట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
