నాగ్‌‌కు ఆ స్టార్ క్రికెటర్ క్లాస్ మేట్

80వ దశకంలో క్రికెట్ చూసిన వాళ్లకు కృష్ణమాచారి శ్రీకాంత్‌ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1983లో ప్రపంచకప్ గెలిచిన లెజెండరీ జట్టు ఆయన సభ్యుడు. ఆ సమయానికి భారత జట్టులో సెహ్వాగ్ తరహా బ్యాట్స్‌మన్ ఆయన. చాలా దూకుడుగా ఆడుతూ జట్టుకు మెరుపు ఆరంభాలు అందించేవాడు. శ్రీకాంత్.. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు క్లాస్ మేట్ అట. క్లోజ్ ఫ్రెండ్ కూడానట. 

ఈ విషయం ఈ ఇద్దరూ ఇంతకుముందు ఎప్పుడూ పెద్దగా చెప్పుకున్నది లేదు. నాగ్ కల్ట్ క్లాసిక్ ‘శివ’ ఈ నెల 14న రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయిస్తున్నాడు కింగ్. ఇందులో శ్రీకాంత్ కూడా భాగం అయ్యడు. నాగ్‌తో కలిసి ఒక వీడియో బైట్ చేశాడు అభిమానులు చిక్కా అని ముద్దుగా పిలుచుకునే శ్రీకాంత్.

‘శివ’ గురించి మాట్లాడే ముందు నాగ్‌తో తన స్నేహం గురించి చెప్పాడు శ్రీకాంత్. నాగ్ కాలేజీ రోజులన్నీ చెన్నైలోనే గడిచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన, శ్రీకాంత్ ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్ అట. కాలేజీలో నాగ్ చాలా కామ్‌గా, ఎక్కువ మాట్లాడకుండా, ఒద్దికగా ఉండేవాడని శ్రీకాంత్ తెలిపాడు. అలాంటి వాడు ఉన్నట్లుండి శివ సినిమాతో యాక్షన్ హీరో అయిపోయేసరికి తామంతా షాక్ అయినట్లు శ్రీకాంత్ తెలిపాడు. 

ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటికి, ఇప్పటికి క్రికెట్లో ఏం మారిందో చెప్పాలని నాగ్‌ను అడిగాడు శ్రీకాంత్. తర్వాత నాగ్ అందుకుని.. కాలేజీ రోజుల్లో శ్రీకాంత్‌ ఆటను తామంతా ఎంతో ఆస్వాదించేవాళ్లమని.. గ్రౌండ్లోకి వెళ్లి కూర్చుంటే శ్రీకాంత్ కొట్టే సిక్సర్లకు బంతి తమ తల మీదుగా వెళ్లేదని చెప్పాడు. అప్పటికి, ఇప్పటికి క్రికెట్ ఎంతో మారిపోయిందని.. చాలా వేగం పుంజుకుందని.. టీ20లంటే తనకు చాలా ఇష్టమని.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తానని నాగ్ చెప్పాడు.