మాస్ పాఠం – వేగం కాదు విజయం ముఖ్యం

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఎప్పుడూ లేనంత బ్యాడ్ ఫేజ్ చూస్తుండటం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఫ్లాపులు అందరికీ సహజమే కానీ తప్పెక్కడ జరుగుతోందో గుర్తించి వెంటనే సరిద్దిద్దుకోకపోతే జరిగే పరిణామాలు మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మాస్ జాతర ఫలితం తేలిపోయింది. హైదరాబాద్ లాంటి ప్రధాన కేంద్రంలో ఆదివారం మూడో రోజు సగం కన్నా తక్కువ ఆక్యుపెన్సీలు నమోదు కావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. దీనికన్నా బాహుబలి ది ఎపిక్ వసూళ్లు భారీగా ఉండటం మరింత బాధిస్తుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇకపై రవితేజ స్వీయ విశ్లేషణ చేసుకోవాల్సిందే.

అసలు ఆయన లెక్క ఎక్కడ తప్పుతోందనేది అనాలసిస్ చేసుకోవాలి. 2015 నుంచి 2025 మధ్యలో సోలో హీరోగా రవితేజ అందుకున్న సూపర్ హిట్లు మూడే. ధమాకా, క్రాక్, రాజా ది గ్రేట్ మాత్రమే అంచనాలకు తగ్గట్టు ఆడాయి. మిగిలిన పదమూడు కమర్షియల్ గా ఎలాంటి ప్రయోజనం అందివ్వలేదు. కిక్ 2, బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఇలా మొత్తం లిస్టు చూసుకుంటే వీటిలో ఏ ఒక్కటి ఆడియన్స్ అంచనాలను కనీస స్థాయిలో అందుకోలేకపోయాయి. అన్నీ ఫ్లాపే.

నాణ్యత కంటే వేగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే రవితేజ దెబ్బ తింటున్నారనేది వాస్తవం. పైగా ట్రెండ్ కు తగ్గ దర్శకులను ఎంచుకోకపోవడం మరో మైనస్. శ్రీకాంత్ ఓదెల, గోపిచంద్ మలినేని, బాబీ కొల్లి, సుకుమార్, సందీప్ వంగా లాంటి హ్యాపెనింగ్ డైరెక్టర్లతో పని చేయాలి. వీళ్ళలో ఇద్దరు ముగ్గురితో రవితేజ గతంలో సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడా ఫ్లాష్ బ్యాక్ ఫ్యాన్స్ కి అనవసరం. క్రేజీ కాంబోలు, కంటెంట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా తమ హీరోలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. జనవరి సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అయినా ఈ డిజాస్టర్ల పరంపరకు బ్రేక్ వేస్తుందేమో చూడాలి.