మాస్ రాజా రవితేజ కెరీర్లో ఎంతో కీలకమైన సినిమా.. మాస్ జాతర. ఆయనకు ధమాకా తర్వాత సరైన విజయం లేదు. వరుసగా డిజాస్టర్లు పడ్డాయి. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో షాక్ మీద షాక్ తిన్నాడు రవితేజ. దీంతో తర్వాతి సినిమా అయిన మాస్ జాతర మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. కొన్ని కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు ఈ శుక్రవారం రిలీజవుతోంది.
ఐతే విడుదల తేదీ పలుమార్లు మారిన నేపథ్యంలో ఈసారి కొంచెం జాగ్రత్తగా డేట్ ఎంచుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాహుబలి: ది ఎంపిక్ రిలీజ్ రోజే మాస్ జాతర విడుదలకు ముహూర్తం నిర్ణయించడంపై రవితేజ అభిమానుల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఐతే బాహుబలిని తక్కువ అంచనా వేశారేమో కానీ 31కే ఫిక్స్ అయ్యారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి ప్రమాదం పొంచి ఉన్న విషయం తెలిసినట్లుంది.
బాహుబలి: ది ఎపిక్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసి 31న సాయంత్రం నుంచి పెయిడ్ ప్రిమియర్స్ మొదలుపెట్టాలని.. తర్వాతి రోజే సినిమాను పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఈ మార్పు వల్ల కూడా పెద్దగా లాభం లేదని అర్థమవుతోంది. మాస్ జాతర బుకింగ్స్ ఆశించినంత గొప్పగా లేవు. ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్‌లో ఉన్న షోలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సోల్డ్ ఔట్ షోలు అసలే లేవు. అదే సమయంలో బాహుబలి: ది ఎపిక్ జోరు మామూలుగా లేవు. పెట్టిన షోలు పెట్టినట్లు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వచ్చేస్తున్నాయి. చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి.
పదేళ్ల ముందు సినిమా.. ఎన్నోసార్లు చూసిన చిత్రం అయినా.. రెండు భాగాలను కలిపి బెస్ట్ విజువల్, సౌండ్ క్వాలిటీతో మరోసారి చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్ జాతరకు అంత ఈజీ కాదని అర్థమవుతోంది. ఆ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తేనే.. బాహుబలి దెబ్బను తట్టుకుని నిలవగలదు. మరి కొత్త దర్శకుడు భాను భోగవరపు అంత మంచి టాక్ తెప్పించే సినిమానే అందించాడా?
Gulte Telugu Telugu Political and Movie News Updates