కింగ్డమ్, వార్-2 సినిమాలు అంచనాలను అందుకోకపోవడం.. ఆ చిత్రాల గురించి నిర్మాత నాగవంశీ రిలీజ్‌కు ముందు మరీ ఎక్కువ చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. భారీ నష్టాల వల్ల నాగవంశీ ఆస్తులు అమ్మేసుకుంటున్నాడని.. ఎవ్వరికీ దొరక్కుండా దుబాయ్‌కి వెళ్లిపోయాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రచారాల గురించి తర్వాత సెటైరిగ్గా స్పందించిన నాగవంశీ, కొంత గ్యాప్ తర్వాత యధావిధిగా సినిమాల్లో బిజీ అయిపోయాడు.
ఇప్పుడు నాగవంశీ నుంచి మాస్ జాతర సినిమా రాబోతోంది. ఈ నెల 31న సాయంత్రం ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి. తర్వాతి రోజు సినిమా పూర్తి స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మాస్ జాతర ప్రి రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడాడు. గత అనుభవాల నేపథ్యంలో ఈ ఈవెంట్లో నాగవంశీ ఆచితూచి మాట్లాడాడు.
మాస్ జాతర సినిమాపై పూర్తి నమ్మకం ఉందని.. రవితేజ నుంచి ఆయన అభిమానులు, సాధారణ ప్రేక్షకులకు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని నాగవంశీ అన్నాడు. కానీ సినిమా గురించి తాను మరీ ఎక్కువగా మాత్రం చెప్పనని నాగవంశీ అన్నాడు. సూపర్ బంపర్ అని అంటే మళ్లీ ఏదైనా తేడా జరిగితే సోషల్ మీడియాలో మళ్లీ తనను అందరూ ఏసుకుంటారని అతనన్నాడు. ఈసారి తాను సినిమా గురించి ఎక్కువ చెప్పనని.. ప్రేక్షకులే సినిమా చూసి పాజిటివ్ గా మాట్లాడతారని అనుకుంటున్నానని నాగవంశీ చెప్పాడు.
ఇలా అనగానే యాంకర్ సుమ అందుకుని.. మాస్ జాతర గురించి నేను చెప్తా అంటూ సినిమాలో ఫుల్ మాస్, ఎంటర్టైన్మెంట్, ఇలా అన్ని అంశాలూ ఉంటాయి అని చెప్పగా.. రిలీజ్ రోజు ఎవరైనా టార్గెట్ చేయాలనుకుంటే సుమగారి ఇన్‌స్టా పేజీ మీద పడాలని.. అంతే తప్ప తనను ఏమీ అనొద్దని నాగవంశీ అన్నాడు. ఎవ్వరూ ఒక మాట అనే స్కోప్ మాస్ జాతర సినిమా ఇవ్వదని.. అయినా సరే ఎందుకైనా మంచిదని ఇలా అంటున్నానని నాగవంశీ చెప్పాడు. ఈసారి ఏం జరిగినా దుబాయ్‌కి మాత్రం వెళ్లనని.. ఆ విషయంలో ఎవరూ టెన్షన్ పడాల్సిన పని లేదని నాగవంశీ అన్నాడు. ఈ సందర్భంగా రవితేజ సినిమాల్లో తనకు వెంకీ చాలా ఇష్టమైన మూవీ అని నాగవంశీ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates