స్టార్ హీరోల వారసులు ఆ లెగసిని మోయడం అంత సులభంగా ఉండదు. లేనిపోని ఒత్తిడి తీసుకుంటే ఫలితాలు తేడా కొట్టడమే కాదు ఏకంగా కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. అక్కినేని మూడో తరం నుంచి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇండస్ట్రీలో ఎంటరై పది సంవత్సరాలు గడిచిపోయాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి డీసెంట్ హిట్ ఉన్నప్పటికీ గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఒక్కటంటే ఒక్కటి లేదు. లెనిన్ కూడా పురిటి నొప్పులు పడుతూనే ఉంది. షూటింగ్ ఆలస్యం, హీరోయిన్ మార్పు ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ఏడాది రిలీజ్ మిస్ చేసుకుంది. అఖిల్ ప్లానింగ్ లోపల వల్లే ఇదంతా జరిగిందనేది వాస్తవం.
ఇక్కడ ధృవ్ విక్రమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇంచుమించు తనది కూడా ఇదే కథ, ఏడేళ్ల క్రితం అర్జున్ రెడ్డి రీమేక్ తో ప్రయాణం మొదలుపెట్టాడు. దర్శకుడు బాలా తీసిన వెర్షన్ నచ్చక దాన్ని పక్కన పెట్టేసి గిరిశాయతో ఫ్రెష్ గా మరొకటి తీయించాడు. ఒరిజినల్ స్థాయిలో మేజిక్ చేస్తుందనుకుంటే సోసోగా ఆడింది. తర్వాత తండ్రితో కలిసి మహాన్ చేస్తే అదేమో అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయ్యింది. ఇటీవలే విడుదలైన బైసన్ కలమందన్ కు మంచి స్పందనే వచ్చింది. ధృవ్ నటన, కష్టం, మారి సెల్వరాజ్ దర్శకత్వానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. హిట్టు స్టాంప్ పడాల్సి ఉంది.
ఇక్కడ అఖిల్, ధృవ్ విషయంలో గమనించాల్సిన సారూప్యత ఒకటే. కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల కెరీర్ నత్తనడకన సాగుతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాగా ఒక స్థాయికి వచ్చాక ఎంత నెమ్మదించినా ఫ్యాన్ ఫాలోయింగ్ రక్షణ కవచంలా తోడు ఉంటుంది. అలా కాకుండా అసలు హిట్టే లేకుండా ఇలా నత్త నడకన సాగితే అభిమానుల్లో కూడా ఆసక్తి సన్నగిల్లుతుంది. బహుశా ఈ కారణంగానే ఇవన్నీ ఆలోచిస్తూ మోక్షజ్ఞ విపరీతమైన లేట్ చేస్తున్నాడని అనుకోవచ్చు. సరే ధృవ్ కు మొదటి బ్రేక్ దక్కింది, ఇక అఖిల్ దాన్ని వచ్చే ఏడాది అందుకుంటాడో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates