మీసాల పిల్లను మరిపించాలి తమన్

సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. కంటెంట్ పరంగా ఇప్పటిదాకా అందరి కంటే ఎక్కువ ఇచ్చింది రాజా సాబే అయినా ఒక విషయంలో వెనుకబడటం ఫ్యాన్స్ లో ఆందోళన రేపుతోంది. అదే ఇప్పటిదాకా ఆడియో సింగల్ రిలీజ్ చేయకపోవడం. పండగ కాంపిటీషన్ లో ఉన్న మన శంకరవరప్రసాద్ గారు నుంచి మీసాల పిల్ల ఆల్రెడీ సోషల్ మీడియాని రూల్ చేస్తోంది. మొదట్లో నెగటివ్ కామెంట్స్ వినిపించినప్పటికీ క్రమంగా ఎక్కేసి వేలల్లో రీల్స్, మిలియన్లలో వ్యూస్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఉదిత్ గాత్రంలో భీమ్స్ చేసిన మేజిక్ ట్యూన్ పూర్తిగా పని చేసింది.

ఇప్పుడు తమన్ మీద ఒత్తిడి ఉంటుంది. రాజా సాబ్ నుంచి నవంబర్ మొదటి వారంలో తొలి పాట లాంచ్ చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ నిరాశ పరిచినా ఓజితో తన కంబ్యాక్ చాటుకున్న తమన్ మ్యూజికల్ గా ఒక కమర్షియల్ ఆల్బమ్ ఇచ్చే ఛాన్స్ రాజా సాబ్ తో అందుకున్నాడు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది. సలార్, కల్కి లాంటివి ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా పాటల పరంగా బాహుబలి స్థాయిలో లేకపోవడం మ్యూజిక్ లవర్స్ లోటుగా ఫీలవుతున్నారు. ఒకప్పుడు మిర్చి, డార్లింగ్ లాగా ఆల్బమ్ మొత్తం బాగుండే పాటల కోసం ప్రభాస్ అభిమానులు మొహం వాచిపోయి ఉన్నారు.

వాళ్ళ అంచనాలను తమన్ అందుకోవాల్సి ఉంటుంది. మీసాల పిల్లని మించిపోయేలా ఫస్ట్ సాంగ్ ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవాలి. జనవరి 9 ఎంతో దూరంలో లేదు. ఇంకో డెబ్భై రోజుల కంటే తక్కువ టైంలో రాజా సాబ్ రిలీజైపోతుంది. ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన దర్శకుడు మారుతీ ఇంకా దాన్నుంచి ఎలాంటి విజువల్స్ బయటికి ఇవ్వలేదు. వచ్చే నెల నుంచి పబ్లిసిటీని పీక్స్ కు తీసుకెళ్లేలా ఒక ప్రత్యేక ప్లాన్ ని సిద్ధం చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన రాజా సాబ్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా విలన్ గా సంజయ్ దత్ మరో ఆకర్షణ కానున్నాడు.