మయకర….. ఎంత మాయ చేశావురా

తిరుగులేని బాక్సాఫీస్ సక్సెస్ సొంతం చేసుకుని ఎనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లతో నెల రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకోవడానికి పరుగులు పెడుతున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ త్వరలోనే ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ఈ మేరకు ప్రమోషన్లు మొదలుపెట్టింది కానీ డేట్ అఫీషియల్ గా చెప్పలేదు. ఇన్ సైడ్ టాక్ అయితే అక్టోబర్ 31 లేదా నవంబర్ మొదటి వారంలో ఉండొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా కాంతారకు సంబంధించిన మేకింగ్ వీడియోలు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మయకర పాత్రకు సంబంధించిన క్లిప్ షాక్ ఇస్తోంది..

ఒకపక్క దర్శకత్వం చూసుకుంటూనే ఇంకోవైపు ఆరు గంటల ప్రోస్తటిక్ మేకప్ డిమాండ్ చేసే మయకరగా రిషబ్ శెట్టి ట్రాన్స్ ఫార్మ్ కావడం ఆసక్తి గొలిపేలా ఉంది. అయితే ఇలా గంటల తరబడీ అలంకరణ చేసుకోవడం విశేషం కాదు. గతంలో ఎందరో స్టార్ హీరోలు చేసిందే. కానీ హీరో బెర్మీ కాకుండా మయకర అనే మరో క్యారెక్టర్ కూడా రిషబ్ శెట్టినే పోషించాడనేది చాలా మంది ప్రేక్షకులు మొదటిసారి చూసినప్పుడు గుర్తు పట్టలేదు. ఇప్పుడు కూడా మేకింగ్ వీడియో చూసి ఔనా అనుకుంటున్నారు తప్ప రిలీజైన టైంలో దీని మీద కనిపించిన ట్వీట్లు తక్కువ. శరీరం కూడా చాలా సన్నగా మారిపోవడం మయకరలో మరో ట్విస్ట్.

నిజానికి దీన్ని విడుదల టైంలోనే రిషబ్ శెట్టి పబ్లిసిటీకి వాడుకుని ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. అసలు తాను డ్యూయల్ రోల్ చేసిన విషయమే ఎక్కడా చెప్పలేదు. మయకర కనిపించేది నిడివి పరంగా కాసేపే అయినా దాని ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. కానీ ప్రేక్షకులను అనవసరంగా డైవర్ట్ చేయడం ఇష్టం లేని రిషబ్ శెట్టి దాన్ని గుట్టుగా ఉంచడం వల్ల మంచి పనే చేశారు. వెయ్యి కోట్ల మార్కు అందుకోవడానికి కొద్దిదూరంలో ఆగిపోయిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ దాన్ని చేరుకునే అవకాశాలు తగ్గినట్టే. బాహుబలి ఎపిక్, మాస్ జాతర, ఆర్యన్ లాంటి కొత్త రిలీజులు స్పీడ్ బ్రేకర్స్ అయ్యేలా ఉన్నాయి.