అంత పెద్ద స్టేట్మెంట్స్ వద్దు బాస్

తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా మైక్ అందుకున్నపుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు, వాళ్లను థియేటర్లకు రప్పించేందుకు తమ సినిమాల గురించి కొంచెం ఎక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తుంటారు. కానీ వాళ్లిచ్చిన హైప్‌కు తగ్గట్లు సినిమా ఉంటే.. ఓకే. 

కానీ తేడా కొడితే మాత్రం ఆ స్టేట్మెంట్లు బూమరాంగ్ అవుతుంటాయి. వాళ్ల ఇమేజ్‌ను, క్రెడిబిలిటీని బాగా డ్యామేజ్ చేస్తుంటాయి. ట్రోల్స్‌కు కూడా దారి తీస్తుంటాయి. గతంలో విశ్వక్సేన్ ‘పాగల్’ అనే సినిమా గురించి మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆ సినిమాకు జనం లేక తొలి వారంలోనే షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక ఈ ఏడాది ఆరంభంలో నేచురల్ స్టార్ నాని ‘కోర్టు’ మూవీ గురించి  ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా నచ్చకపోతే తాను హీరోగా నటించే తర్వాతి సినిమాను చూడొద్దని అన్నాడు. ఐతే నాని ఊరికే మాట వదిలే రకం కాదు. ‘కోర్టు’ మీద పూర్తి ధీమాతోనే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. జనాలకు ఆ సినిమా నచ్చింది. కాబట్టి ‘హిట్-3’కి ఇబ్బంది లేకపోయింది. కానీ ‘కోర్టు’లో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శి.. నానిని అనుకరిస్తూ ‘మిత్రమండలి’ సినిమా విషయంలో ఇలాంటి ఛాలెంజే విసిరాడు

‘మిత్రమండలి’ నచ్చకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దు అనేశాడు. తీరా చూస్తే.. ‘మిత్రమండలి’కి చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. రివ్యూలు ఏమాత్రం అనుకూలంగా లేవు. తొలి రోజే సినిమా డౌన్ అయిపోయే పరిస్థితి కనిపించింది. ‘మిత్రమండలి’ విషయంలో ప్రియదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ తన తర్వాతి చిత్రం ‘ప్రేమంటే’కు ఇబ్బందిగా మారింది. అందుకే సినిమాకు హైప్ ఇవ్వడం కోసం మరీ పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వకపోవడం మంచిది.