రానా దగ్గుబాటి హీరోగా ‘హిరణ్య కశ్యప’ తీయడం గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. చివరగా ‘రుద్రమదేవి’ లాంటి భారీ చిత్రాన్ని తీసిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఈ మెగా ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నాడు. దీని మీద ఎడతెగని పరిశోధన చేస్తున్నాడు. ఆయన పరిశోధన, స్క్రిప్టు నచ్చి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు రానా తండ్రి సురేష్ బాబు.
ఐతే సురేష్ పెద్ద బడ్జెట్లలో సినిమాలు తీయడం ఎప్పుడో మానేశారు. గత దశాబ్ద కాలంలో ఆయన తీసిన అతి పెద్ద సినిమా అంటే ‘వెంకీ మామ’నే. మిగతావన్నీ చిన్న, మీడియం రేంజి సినిమాలే. బడ్జెట్ విషయంలో బాగా పొదుపు పాటించే ఆయన దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ అయ్యే ‘హిరణ్య కశ్యప’ను రానా, గుణశేఖర్‌లను నమ్మి ఎలా తీస్తాడన్న సందేహం అందరిలోనూ ఉంది.
దీనికి తోడు కరోనా దెబ్బకు ఇండస్ట్రీలో దారుణమైన పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ‘హిరణ్య కశ్యప’కు బ్రేక్ పడిందన్న ప్రచారం మొదలైంది. ముందు బడ్జెట్లో కోత అన్నారు. తర్వాత సినిమానే ఆపేస్తున్నారని మాట్లాడుకున్నారు. కానీ సురేష్ బాబు మాత్రం ఆ సినిమా కచ్చితంగా ఉందనే అంటున్నారు. కరోనా నేపథ్యంలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రొడక్షన్లో రాబోయే కొత్త సినిమాల గురించి ఆయన మాట్లాడారు.
‘హిరణ్య కశ్యప’ తప్పక ఉంటుందని.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని చెప్పారు సురేష్ బాబు. మిగతా సినిమాల గురించి చెబుతూ.. ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిందని.. మే 1న రిలీజ్ అనుకున్నామని.. లాక్ డౌన్ వల్ల కుదరట్లేదని చెప్పారు.
వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘నారప్ప’ 25 శాతం చిత్రీకరణ మిగిలుందని.. ‘విరాట పర్వం’కు ఇంకో 8 రోజులు పని చేస్తే సరిపోతుందని చెప్పారు. రవిబాబుతో నిర్మిస్తున్న ‘క్రష్’కు కూడా ఇంకో ఐదారు రోజుల పని మాత్రమే మిగిలున్నట్లు ఆయన తెలిపారు. మిగతా సినిమాల సంగతలా ఉంచితే.. ‘హిరణ్య కశ్యప’ ఉంటుందన్నది ఆసక్తికర అప్ డేటే.