ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన చిన్న పాత్ర చేసినా దాంతో వేసే ముద్ర బలంగా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆయన చేసిన ఫ్రెండ్లీ ఫాదర్ క్యారెక్టర్లు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్నాయి. ఎక్కువగా క్యారెక్టర్ రోల్సే చేసిన బాలు.. లీడ్ రోల్ చేసిన పాత్ర కూడా ఒకటుంది. అదే.. మిథునం. సీనియర్ నటి లక్ష్మితో కలిసి ఆ సినిమాలో అద్భుత అభినయం ప్రదర్శించారు బాలు.
ఆ సినిమాలో వాళ్లిద్దరివి తప్ప వేరే పాత్రలుండవు. శ్రీ రమణ రచన.. తనికెళ్ల భరణి దర్శకత్వం.. బాలు, లక్ష్మిల అభినయం అద్భుతంగా పండి ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచింది. కమర్షియల్‌గా ఎలాంటి ఫలితాన్నందుకుందన్నది పక్కన పెడితే ‘మిథునం’ ఓ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు.
ఇప్పుడీ ప్రయోగాత్మక చిత్రం హిందీలోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్లో కథలు కరవై దక్షిణాది వైపు చూస్తుండటం తెలిసిందే. ఇక్కడ విజయవంతమైన సినిమాలన్నీ అక్కడ రీమేక్ చేసేస్తున్నారు. ‘ఊసరవెల్లి’ లాంటి డిజాస్టర్ సైతం హిందీలోకి వెళ్తుండటం విశేషం. ఐతే ‘మిథునం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని బాలీవుడ్ వాళ్లు రీమేక్ కోసం ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
బాలు పాత్రను హిందీలో ఎవరు చేస్తే బాగుంటుందనే ప్రశ్న తలెత్తితే.. అమితాబ్ బచ్చన్‌ను మించి ఆప్షన్ కనిపించదు. రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాణ సంస్థ కూడా ఈ చిత్రాన్ని ఆయనతో తీయాలనే అనుకుంటోందట. మరి లక్ష్మి పాత్రకు ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ‘మిథునం’ సినిమా చూస్తే అమితాబ్ కచ్చితంగా బాలు పాత్ర చేయడానికి ముందుకు రావచ్చు. ఆయనలోని నటుడిని పూర్తిగా సంతృప్తి పరిచే చిత్రమవుతుంది. ఇలాంటి ప్రయోగాలకు అమితాబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కూడా. మరి నిజంగా ఆయనే ఆ పాత్ర చేస్తారా.. హిందీలో ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి.