గత గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైంది కాంతార: చాప్టర్-1 సినిమా. రిలీజ్ ముంగిట అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంత జోరుగా లేకపోయినా.. విడుదల రోజు అద్భుత స్పందనే వచ్చిందీ చిత్రానికి. తొలి రోజే రూ.90 కోట్ల దాకా గ్రాస్ కొల్లగొట్టిందీ సినిమా. వీకెండ్లోనే వసూళ్లు రూ.300 కోట్లను దాటిపోయాయి. వారాంతం అయ్యాక వసూళ్లు డ్రాప్ అయినప్పటికీ.. అది ఆందోళన కలిగించే స్థాయిలో అయితే లేదు.
కన్నడ, తెలుగు, తమిళంలో సినిమాకు మంచి స్పందనే వస్తోంది. దేశవ్యాప్తంగా కాంతార ప్రీక్వెల్ మంచి ఊపులోనే సాగుతోంది. ఈ వీకెండ్లో పెద్ద రిలీజ్‌లేమీ లేవు కాబట్టి.. కాంతార: చాప్టర్-1 ఇండియన్ బాక్సాఫీస్‌లో లీడర్‌గా కొనసాగడం ఖాయం. కన్నడలో, హిందీలో సినిమాకు లాంగ్ రన్ ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగులో కూడా దీపావళి సినిమాలు వచ్చే వరకు కాంతారకు ఢోకా లేనట్లే. మొత్తంగా ఇండియాలో అన్ని ఏరియాల బయ్యర్లకు మంచి లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
కానీ ఓవర్సీస్‌లో మాత్రం కాంతార: చాప్టర్-1కు బాక్సాఫీస్ దగ్గర షాక్ తప్పేలా లేదు. ముఖ్యంగా యుఎస్‌లో ఈ సినిమా బయ్యర్‌కు నష్టాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం ఏకంగా 50 కోట్ల దాకా పెట్టుబడి పెట్టేశారు. కాంతార ప్రీక్వెల్ కావడంతో జనం ఎగబడి చూస్తారనే ధీమాతో భారీ పెట్టుబడి పెట్టారు. కానీ ఈ చిత్రం ప్రిమియర్స్ నుంచే ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. వీకెండ్ అయ్యేసరికి వసూళ్లు 2.7 మిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.
రెండో వీకెండ్ కూడా మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నప్పటికీ.. అవి సరిపోవు. ఫుల్ రన్లో వసూళ్లు 4-5 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ యుఎస్‌లో 7 మిలియన్ల దాకా కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వని పరిస్థితి. కాబట్టి నష్టం పెద్దగానే ఉండే అవకాశముంది. ఓజీ సినిమాను తక్కువకు తీసుకుని మంచి లాభాలందుకున్న సంస్థే కాంతార ప్రీక్వెల్‌ను కూడా రిలీజ్ చేసింది. అక్కడ వచ్చిన లాభం..చూస్తుంటే ఈ సినిమాలో పోయేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates