తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మల్టీప్లెక్సులు ఉన్నప్పటికీ.. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ‘ఏఎంబీ సినిమాస్’కు ఉన్న క్రేజే వేరు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మితమైన ఈ మెగా మల్టీప్లెక్స్ ఆరంభం నుంచే బంపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతకుముందు వరకు ప్రసాద్ మల్టీప్లెక్స్ అంటే జనం బాగా ఉత్సాహం చూపించేవారు.
కానీ మహేష్ మల్టీప్లెక్స్ వచ్చాక హైదరాబాద్‌లో నంబర్ వన్ స్థానానికి వెళ్లిపోయింది. మిగతా ఏ మల్టీప్లెక్స్‌తో పోల్చుకున్నా ఇక్కడ ఆక్యుపెన్సీలు ఎక్కువ ఉంటాయి. ఏఎంబీలో సినిమా చూడడాన్ని హైదరాబాదీలు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఏషియన్ వాళ్లతో వేరే స్టార్ హీరోలు అసోసియేట్ అయిన మల్టీప్లెక్సులకూ మంచి స్పందన ఉన్నప్పటికీ.. మహేష్ మల్టీప్లెక్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. ఈ క్రమంలోనే మహేష్, ఏషియన్ భాగస్వామ్యంలో మరో మల్టీప్లెక్స్ రెడీ అవుతోంది.
హైదరాబాద్‌లో సుదీర్ఘ చరిత్ర, థియేటర్ల పరంగా లెజెండరీ స్టేటస్ ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలిసారిగా నిర్మితమవుతున్న మల్టీప్లెక్స్ ‘ఏఎంబీ క్లాసిక్’. ఏషియన్ వాళ్లే మహేష్ భాగస్వామ్యంతో ఈ మల్టీప్లెక్స్‌ను అనౌన్స్ చేశారు. దీని నిర్మాణం తుది దశకు వచ్చింది. ఇంతకుముందు సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న ప్రదేశంలోనే ఇది నిర్మాణం జరుపుకుంటోంది. చాలా ఏళ్ల కిందటే సుదర్శన్ 70 ఎంఎంను కొట్టేశారు. ఏడు స్క్రీన్లతో ‘ఏఎంబీ క్లాసిక్’ నిర్మాణం జరుపుకుంటోంది. దీన్ని 2026 సంక్రాంతికి ఓపెన్ చేయబోతున్నారని సమాచారం.
బహుశా జనవరి 9న రాజా సాబ్ మూవీతోనే ‘ఏఎంబీ క్లాసిక్’ అరంగేట్రం ఉండొచ్చు. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు లాంటి క్రేజీ చిత్రాలు రాబోతుండడంతో ఏఎంబీ క్లాసిక్ జనాలతో కళకళలాడడం ఖాయం. క్రాస్ రోడ్స్‌లో సింగిల్ స్క్రీన్లలో సినిమా చూడడాన్ని హైదరాబాదీలు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. అలాంటి చోట తొలిసారిగా మల్టీప్లెక్స్ రాబోతోంది. దీనికి ఎదురుగా ఒడియన్ థియేటర్స్ ఉన్న చోట ఒక మాల్ మొదలు కానుంది. అందులో ఐనాక్స్ స్క్రీన్లు రాబోతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates