లాట‌రీ కింగ్‌గా నాగ్?

టాలీవుడ్ సీనియ‌ర్, లెజెండ‌రీ హీరోల్లో ఒక‌రైన అక్కినేని నాగార్జున వందో సినిమా ముంగిట ఉన్నాడు. ఆ సినిమా కోసం అభిమానులు చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్ల ముందు నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా మొదలు కావట్లేదు. మోహన్ రాజా సహా వేర్వేరు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. పక్కకు వెళ్లిపోయాయి. చివరికి తమిళ దర్శకుడే అయిన రా.కార్తీక్‌తో నాగ్ జట్టు కట్టబోతున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. 

చివ‌రికి స్వ‌యంగా నాగార్జునే ఈ యువ ద‌ర్శ‌కుడితో త‌న వందో సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌లే క‌న్ఫ‌మ్ చేయ‌డంతో అభిమానులు ఖుషీ అయ్యారు. నాగ్ పుట్టిన రోజు అయిన ఆగ‌స్టు 29న అ సినిమా అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని ఆశించారు కానీ.. అది జ‌ర‌గ‌లేదు. ఐతే స్క్రిప్టు ప‌క్కాగా రెడీ అయి, షూటింగ్‌కు ఏర్పాట్లు జ‌రిగాకే సినిమాను అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో నాగ్ అండ్ టీం ఆగిన‌ట్లు తెలుస్తోంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనున్న‌ట్లు స‌మాచారం.

నాగ్ వందో సినిమాకు క్రేజీ టైటిల్ పెట్ట‌బోతున్న‌ట్లు ఓ స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. లాట‌రీ కింగ్ అనే టైటిల్‌తో ఈ సినిమా రాబోతోంద‌ట‌. నాగ్ ఇప్ప‌టికే కింగ్ సినిమా చేశాడు. ఆ సినిమా త‌ర్వాతి నుంచి నాగ్‌ను అభిమానులు యువ సామ్రాట్ అని కాక కింగ్ అని పిలుచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే నాగ్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీకి అది క‌లిసొచ్చేలా లాట‌రీ కింగ్ అనే టైటిల్ ఖాయం చేసిన‌ట్లు చెబుతున్నారు. వందో సినిమాలో అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులూ ఉండాల‌న్న అభిమానుల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే ఈ చిత్రం ఉంటుంద‌ని నాగ్ ఇప్ప‌టికే సంకేతాలు ఇచ్చారు.  

ముందు నాగ్ వందో సినిమా రీమేక్ అని వార్త‌లు వ‌చ్చినా.. నాగ్ ఆ ప్ర‌చారాన్ని ఖండించాడు. ఇది గ్రాండియర్ ఉన్న సినిమా అని, భారీ యాక్షన్ ఉంటుందని.. దాంతో పాటే ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్లూ ఉంటాయని స్పష్టం చేశాడు. చివ‌ర‌గా హీరోగా 2024 సంక్రాంతికి నా సామిరంగ చిత్రంతో ప‌ల‌క‌రించిన నాగ్.. ఈ ఏడాది కుబేర‌, కూలీ చిత్రాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించారు. ఆయ‌న వందో సినిమా వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.