రెండేళ్ల తర్వాత నాగశౌర్య దర్శనం

ఛలో టైంలో హీరో నాగశౌర్యకి మంచి మార్కెట్ ఏర్పడింది. దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ వల్లే రష్మిక మందన్న టాప్ హీరోయినయ్యేందుకు మార్గం ఏర్పడింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ తర్వాత నాగశౌర్యవి వరసగా తొమ్మిది సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. కణం, అమ్మమ్మగారిల్లు, అశ్వద్ధామ, నర్తనశాల, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వృందా విహారి, ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి, రంగబలి ఒకదాన్ని మించి మరొకటి టపా కొట్టేశాయి. మధ్యలో ఓ బేబీ ఒకటే ఆడింది. సబ్జెక్టుల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల నాగశౌర్య ఆశించిన స్థాయి స్పీడ్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది.

త్వరలో బ్యాడ్ బాయ్ కార్తీక్ గా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నాగ శౌర్య. తాజాగా టీజర్ వదిలారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. అందరూ బాడ్ బాయ్ అనుకునే కుర్రాడు జీవితంలో ఎన్నో పెద్ద సవాళ్లు ఎదురు కోవాల్సి వస్తుంది. అదెలా అనేదే తెరమీద చూడమంటున్నారు దర్శకుడు రమేష్. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయని ఈ యూత్ ఎంటర్ టైనర్ లో శ్రీదేవి విజయ్ కుమార్, సాయికుమార్, సముతిరఖని, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. దీనికి హరీస్ జైరాజ్ సంగీతం సమకూర్చడం విశేషం. ఫార్ములా సంగతి పక్కనపెడితే విజువల్స్ మాస్ ని టార్గెట్ చేసుకున్నాయి.

వరస వైఫల్యాలు నాగశౌర్యని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ మరీ ఇంత గ్యాప్ తీసుకోవడం ఫ్యాన్స్ కోణంలో అసంతృప్తి కలిగిస్తుంది. నిజానికి రంగబలి తర్వాత నాగశౌర్య పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమా ఒప్పుకున్నాడు. కానీ అది ప్రారంభం కాకముందే నిర్మాత చనిపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్ళీ రీ స్టార్ట్ చేయలేదు. ఈలోగా వేరొకరు ఆ టైటిల్ వాడేసుకున్నారు. సో ఇప్పుడు ఆశలన్నీ బ్యాడ్ బాయ్ కార్తీక్ మీదే ఉన్నాయి. ప్రస్తుతం రాబోయే మూడు నెలల్లో స్లాట్స్ అన్నీ బిజీగా ఉండటంతో సరైన డేట్ కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ ఉండొచ్చు.