సౌత్ ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చిన చిత్రాల్లో కేజీఎఫ్ ఒకటి. బాహుబలి తర్వాత అతి పెద్ద సెన్సేషన్ ఈ చిత్రమే. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయి. హీరో యశ్ రేంజే మారిపోయింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు. ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కూడా తిరుగులేని స్థాయికి చేరుకుంది.
కథానాయిక శ్రీనిధి శెట్టి కూడా బిజీ హీరోయిన్‌గా మారింది. ఆల్రెడీ ఆమె తెలుగులో హిట్-3 చిత్రంలో నటించింది. త్వరలోనే తెలుసు కదా మూవీతో పలకరించబోతోంది. వీటి కంటే ముందు రామాయణం లాంటి మెగా మూవీ కోసం ఆమె పేరును కన్సిడర్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సీత పాత్రకు అడిగితే శ్రీనిధి నో చెప్పినట్లు రూమర్లు వినిపించాయి. ఇదే విషయాన్ని తెలుసు కదా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తే.. ఆ ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది శ్రీనిధి.
”రామాయణం లాంటి మెగా మూవీలో సీత పాత్ర చేసే అవకాశం వస్తే ఎవరైనా రిజెక్ట్ చేస్తారా అంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం తాను ఆడిషన్ ఇచ్చిన మాట వాస్తవమే అని ఆమె వెల్లడించింది. రామాయణం సినిమా కోసం నన్ను అడిగారు. కాల్ రాగానే వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. అంత పెద్ద సినిమాలో ఛాన్స్ అంటే ఎవ్వరైనా హ్యాపీగా ఫీలవుతారు. అందులోనూ సీత పాత్ర అంటే కాళ్లకు దండం పెట్టి తీసుకుంటారు. నేను ఆ పాత్ర చేయాలని ఆశపడ్డా.
కానీ వాళ్లు ఈ పాత్ర కోసం చాలా పేర్లను పరిశీలించి ఉంటారు. వాళ్ల దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. అందులో ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్లను తీసుకుంటారు. అందులో నేను ఫీలయ్యేది ఏమీ లేదు. ఆ పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారని తెలిసినపుడు.. మన సౌత్ నుంచే ఒక అమ్మాయిని తీసుకున్నారు కదా అని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇలాంటి సినిమాను రిజెక్ట్ చేయడం అంటూ ఏమీ ఉండదు. అది తప్పు” అని శ్రీనిధి శెట్టి పేర్కొంది. హిట్-3తో హిట్ కొట్టిన శ్రీనిధి.. తెలుసు కదా విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. స్టైలిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ నీరజ కోన రూపొందించిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రీనిధితో పాటు రాశి ఖన్నా కూడా కథానాయికగా నటించింది. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates