కాంతార: చాప్టర్-1 సినిమా మేకింగ్ దశలో ఉండగా టీం ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. యూనిట్లో జరిగిన ప్రమాదాల గురించి వార్తలు వచ్చాయి తప్ప.. టీం నుంచి అప్‌డేట్స్ అస్సలు లేవు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్లు ఊపందుకోలేదు. ఈ సినిమాకు టీజర్ రిలీజ్ చేయలేదు. రెగ్యులర్‌గా పాటలు రిలీజ్ చేయడం, వేరే ప్రోమోలు వదలడం లాంటివేమీ చేయలేదు. కేవలం రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు ఒక ట్రైలర్ వదిలారు. దానికి కూడా మిశ్రమ స్పందన వచ్చింది. భారీ అంచనాలున్న సీక్వెల్ మూవీని ఇలాగేనా ప్రమోట్ చేసేది అంటూ కన్నడ అభిమానులే టీంను తప్పుబట్టారు.
అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ప్రమోషన్లు సరిగా లేకపోవడమే కారణమంటూ రిషబ్ శెట్టి అండ్ టీం మీద విమర్శలు గుప్పించారు. కానీ సినిమాలో బలమైన కంటెంట్ ఉన్నపుడు పబ్లిసిటీతో హడావుడి చేయాల్సిన అవసరమే లేదని కాంతార: చాప్టర్-1 రుజువు చేసింది.
కాంతార ప్రీక్వెల్‌ను రిలీజ్ తర్వాత జనమే నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు రిలీజ్ తర్వాత కూడా టీం నుంచి పెద్దగా ప్రమోషన్లు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రేక్షకులే ఈ సినిమాను బలంగా ప్రమోట్ చేస్తున్నారు. చూసిన వాళ్లందరూ పాజిటివ్ పోస్టులు పెడుతున్నారు. డోంట్ మిస్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్స్ అంటూ బోలెడన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. మౌత్ పబ్లిసిటీ కూడా బాగా పని చేస్తోంది. తొలి రోజు నుంచి కాంతార: చాప్టర్-1కు వసూళ్లు నిలకడగా ఉన్నాయి. రెండో రోజు కలెక్షన్లలో కొంత డ్రాప్ కనిపించింది కానీ.. శని, ఆదివారాల్లో ఈ సినిమా వసూళ్ల మోత మోగింది.
శనివారానికే ఈ మూవీకి కలెక్షన్లు రూ.235 కోట్ల మేర వచ్చాయి. ఆదివారం రన్ అయ్యేసరికి వసూళ్లు రూ.300 కోట్లకు చేరువగా ఉండబోతున్నాయి. పెద్దగా ప్రమోషన్ లేకపోయినా.. కేవలం ప్రీక్వెల్ హైప్, కంటెంట్‌తో ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టింది. తాను మరోసారి గొప్ప సినిమా తీశానని రిషబ్ శెట్టి బలంగా నమ్మాడు కాబట్టే ప్రమోషన్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. రిషబ్ అండ్ టీం ఎఫర్ట్‌ను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. కాంతార బ్రాండును క్యాష్ చేసుకుందామని కాకుండా మరోసారి ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచాలని అతను పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపించింది. అందుకే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి గొప్ప ప్రోత్సాహం లభిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates