ఈ మధ్యాకాలంలో సాలిడ్ గా చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్లలో మొదటి స్థానం మిరాయ్ దే. ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ లోనూ అద్భుతమైన క్వాలిటీ ఇవ్వడమే కాక టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా దాన్ని వాడుకోకుండా సాధారణ ధరలకే పరిమితం కావడం గొప్ప మేలు చేసింది. ఇంత టఫ్ కాంపిటీషన్ లోనూ నూటా యాభై కోట్ల వసూళ్లు దాటడం మాములు విషయం కాదు. ఓజి, కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా సరే ఇప్పటికీ మిరాయ్ కి నాలుగో వారంలో మంచి ఆక్యుపెన్సీలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన కేంద్రాల్లో రోజుకు కనీసం మూడు నాలుగు షోలు పడుతూనే ఉన్నాయి.
ఇంత మంచి రన్ కొనసాగుతుండగానే మిరాయ్ ఓటిటిలో వచ్చేస్తోంది. జియో హాట్ స్టార్ లో నాలుగు భాషల్లో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంటే థియేటర్ విండో కేవలం 28 రోజులు మాత్రమే. గతంలో హనుమాన్ ఇంతకన్నా గొప్ప విజయం సాధించినప్పుడు నిర్మాతల అభ్యర్థన మేరకు 55 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు. అది కూడా హాట్ స్టార్ లోనే. కానీ మిరాయ్ మాత్రం అందులో సగం విండోకే బుల్లితెరపై రావడం అనూహ్యం. ఓజి, కాంతార తాకిడి ముందే గురించడం వల్లే అగ్రిమెంట్ నాలుగు వారాలకు చేసుకున్నారని అంతర్గత సమాచారం.
విచిత్రం ఏమిటంటే ఆగస్ట్ లో రిలీజైన వార్ 2 ఇప్పటిదాకా డిజిటల్ లో రాలేదు. అక్టోబర్ 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో రానుంది. హిందీలో మల్టీప్లెక్సుల నిబంధన మేరకు ఎనిమిది వారాల గడువు ఖచ్చితంగా పాటించాల్సిందే. అందుకే ఇంత ఆలస్యమవుతోంది. కానీ దక్షిణాదిలో అలాంటి కండీషన్లు లేకపోవడంతో నిర్మాతలు నెల రోజులకే పరిమితమవుతున్నారు. తేజ సజ్జ హీరోగా రూపొందిన మిరాయ్ ఇంత తక్కువ గ్యాప్ లో స్మార్ట్ స్క్రీన్ లో వచ్చేస్తోంది కాబట్టి వ్యూయర్ షిప్ భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడ కూడా రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. హిందీ వెర్షన్ మాత్రం కొంచెం లేట్ చేస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates