ప్యాన్ ఇండియా సినిమాలకు ట్రంప్ దెబ్బ

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వేసిన తాజా బాంబు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇకపై యుఎస్ కాకుండా బయట తీసే లేదా ఇతర దేశాల నుంచి వచ్చే సినిమాలకు 100 శాతం టారిఫ్ విధిస్తామని ప్రకటించడం నిర్మాతలకు అశనిపాతంగా మారింది. నిజంగా ఇది అమలు చేస్తే ఓవర్ సీస్ బిజినెస్ లో ప్రకంపనలు రేగుతాయి. ఎందుకంటే ఈ మార్కెట్ ని నమ్ముకునే చాలా నిర్మాతలు తమ బడ్జెట్ లను అమాంతం పెంచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే మొత్తం రికవర్ అయ్యే ఛాన్స్ లేని మీడియం రేంజ్ హీరోల మీద కూడా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కారణం యుఎస్ వ్యాపారం.

ఇప్పుడు దాని మీద వంద శాతం టారిఫ్ అంటే గుండెల్లో డైనమెట్లు పేలినట్టే. ఎందుకంటే ఏదైనా ప్యాన్ ఇండియా సినిమా యూఎస్ హక్కులను పది కోట్లకు ఒక డిస్ట్రిబ్యూటర్ కొన్నాడనుకుంటే అంతే మొత్తాన్ని పన్ను రూపంలో ట్రంప్ సర్కారుకు చెల్లించాలి. అప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రెట్టింపు అవుతుంది. లాభాలు దేవుడెరుగు కనీసం నష్టాలు రాకూడదన్నా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. యావరేజ్ లు, ఫ్లాపులు నిండా మునిగిపోవడం ఖాయం. దీనివల్ల టికెట్ రేట్లు మరింత పెంచాల్సి వస్తుంది. అప్పుడు ఎన్ఆర్ఐలు ప్రతి సినిమాని థియేటర్లో చూసేందుకు ఇష్టపడరు. సెలెక్టివ్ గా మారిపోయి రివ్యూలు, టాక్స్ మీద ఎక్కువ ఆధారపడతారు.

దీని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడీ టారిఫ్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇకపై మన ప్రొడ్యూసర్లు డిమాండ్ చేసినంత మొత్తాన్ని ఓవర్సీస్ బయ్యర్లు ఇవ్వరు. టారిఫ్ ని బూచిగా చూపించి తగ్గించమంటారు. పోనీ ఏదైనా బ్యాక్ డోర్ మార్గంలో బిజినెస్ చేద్దామా అంటే మన దగ్గర చెల్లినట్టు అమెరికాలో కుదరదు. ప్రతిదీ వైట్ లోనే జరగాలి. లెక్కలు పక్కాగా చూపించాలి. పూర్తి పిక్చర్ అర్థం కావాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలని, ఏదైతేనేం ఇకపై ప్యాన్ ఇండియా మూవీస్ కు అమెరికా మార్కెట్ లో పెను సవాళ్లు ఎదురు కాబోతునన్నాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.