బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్… నైట్ వాచ్‌మన్‌

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’ సినిమాకు అత్యధిక ప్రశంసలు అందుకున్నది సంగీత దర్శకుడు హరి గౌరనే. రెండేళ్ల ముందు ‘హనుమాన్’ సినిమాతో సత్తా చాటిన అతను.. ఇప్పుడు ‘మిరాయ్’ మూవీకి ఇంకా అద్భుతమైన సంగీతంతో పెద్ద బలంగా నిలిచాడు. ఇందులో విలన్ పాత్ర చేసిన మంచు మనోజ్.. సక్సెస్ మీట్ సందర్భంగా తన కంటే చిన్న వాడైన హరికి పాదాభివందనం చేశాడంటే.. తనెంత గొప్ప సంగీతం అందించాడో అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రవచనకర్త సైతం హరి సంగీతాన్ని కొనియాడడం విశేషం.

హరి ఈ స్థాయికి చేరడం వెనుక చాలా కష్టమే ఉంది. ఒక ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు కావడం వెనుక కష్టాలను అతను వివరించాడు. గోదావరి ప్రాంతమైన తునికి చెందిన హరి సంగీత దర్శకుడు అవుదామని హైదరాబాద్‌కు రాగా.. ఇక్కడ అవకాశాలు అందక నైట్ వాచ్‌మన్‌గా పని చేశాడట. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక కూడా ఎన్నో కష్టాలు పడడంతో పాటు మోసాలకూ గురయ్యాడట. వాటి గురించి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘నేను ఇంటర్ సమయానికి వచ్చేసరికే అంతకుముందు నాన్న కొనిచ్చిన గిటార్‌తో బాణీలు కట్టేవాడిని. అవి విన్న వాళ్లు సినిమా ట్రై చేయమంటే డ్యాన్సర్ కావాలనకున్న ఒక ఫ్రెండుతో కలిసి హైదరాబాద్ వచ్చా. కానీ మాకిక్కడ ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద పడకుంటూ గుడిలో ప్రసాదం తింటూ అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్లం. సరైన తిండి లేక మా ఫ్రెండ్ మంచాన పడడంతో ఇంటికి వెళ్లిపోయాం. తర్వాత డిగ్రీ పూర్తి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చా. కానీ అప్పుడు కూడా అవకాశాలు దక్కలేదు. దీంతో ఏడు వేల జీతానికి నైట్ వాచ్‌మన్‌గా చేరాను.

పగటి పూట ఇందిరా నగర్ కూడలిలో గిటార్ వాయించేవాడిని. ఆ టైంలోనే ఒక ఫ్రెండు చక్రి గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన దగ్గర రెండేళ్లు పని చేశాక వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి నెల జీతం మీద వెళ్లాను. కానీ అతను నా ట్యూన్లను తనవిగా వాడుకున్నాడు. జీతం విషయంలో మోసం చేశాడు. ఆపై ఒక బ్లాక్‌బస్టర్ సినిమాకు 98 శాతం పనులు నేనే చేస్తే దాని దర్శకుడు క్రెడిట్ ఇంకెవరికో ఇచ్చారు. ఆ తర్వాత తుంగభద్ర, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రాలకు పని చేశాను. ‘హనుమాన్’తో నా కెరీర్ మలుపు తిరిగింది. ‘మిరాయ్’ ఇంకా పెద్ద విజయాన్ని అందించింది’’ అని హరి గౌర తెలిపాడు.