చిన్న సినిమాల్లో పెద్ద సంచలనంగా నిలిచిన చిత్రం.. లిటిల్ హార్ట్స్. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఏకంగా 45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఘాటి, మదరాసి లాంటి పెద్ద సినిమాలకు పోటీగా రిలీజైన లిటిల్ హార్ట్స్.. వాటిని వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పంట పండించుకుంది. పెద్ద సినిమాలు కూడా వారం తర్వాత స్లో అయిపోతున్న రోజుల్లో.. మూడు వారాల పాటు ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ఓజీ వచ్చాక కానీ లిటిల్ హార్ట్స్ జోరు తగ్గలేదు.
థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోతున్న వాళ్లు.. ఓటీటీలో చూద్దామని ఎదురు చూస్తున్నారు. ఐతే అక్టోబరు 1న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతోందని ఇటీవల సోషల్ మీడియాలో ఎవరో పోస్టు పెడితే.. అది నిజం కాదంటూ దీని నిర్మాణంలో భాగమైన ఈటీవీ విన్ నుంచి రిప్లై వచ్చింది. తమ సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నాయని, ఇప్పుడిప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయమని ఈటీవీ విన్ ఎక్స్ హ్యాండిల్లో ప్రకటించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఈటీవీ విన్ స్వయంగా లిటిల్ హార్ట్స్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఇంతకుముందు ప్రచారం జరిగిన డేట్‌కే ఈ సినిమా ఓటీటీలోకి రానుండడం విశేషం. అక్టోబరు 1 నుంచి లిటిల్ హార్ట్స్ స్ట్రీమ్ అవుతుందని ఈటీవీ విన్ ప్రకటించింది. ఐతే స్ట్రీమింగ్ విషయంలో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. థియేటర్లలో లేని అదనపు సన్నివేశాలతో రాబోతోందట ఓటీటీ వెర్షన్.
ఇది ఎక్స్‌టెండెడ్ వెర్షన్ అని డిజిటల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ఈటీవీ విన్ ప్రకటించింది. కాబట్టి థియేటర్లలో చూసిన వాళ్లు కూడా ఓటీటీలో ఈ సినిమాపై ఓ లుక్కేయడానికి అవకాశముంది. ఈటీవీ విన్ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్‌తో నటుడిగా పరిచయం అయిన మౌళి లీడ్ రోల్ చేసిన లిటిల్ హార్ట్స్‌లో అంబాజీపేట మ్యారేజీబ్యాండు ఫేమ్ శివాని నగరం కథానాయికగా నటించింది. నైంటీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాను సాయిమార్తాండ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో భాగమైన అందరికీ అవకాశాలు వెల్లువెత్తేలా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates