సుకుమార్ ఫ్యాక్టరీ నుంచి ఇంకో దర్శకుడు

ఒకప్పుడు బాలీవుడ్లో రామ్ గోపాల్ వర్మ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దర్శకుడిగా కళాఖండాలను అందించడమే కాక.. ఆర్జీవీ ఫ్యాక్టరీ అని బేనర్ పెట్టి పదుల సంఖ్యలో కొత్త నటీనటులు, టెక్నీషియన్లను పరిచయం చేస్తూ ఒక పెద్ద వ్యవస్థగా మారాడు వర్మ. ఆయన శిష్యరికం చేసి దర్శకులైన వారి జాబితా పెద్దదే. ఇప్పుడు టాలీవుడ్లో ఇలాగే కొత్త దర్శకులను తయారు చేసే ఫ్యాక్టరీగా మారాడు సుకుమార్. సుకుమార్ రైటింగ్స్ పేరుతో బేనర్ పెట్టి ఆయన ఇప్పటికే పలువురు దర్శకులను తెలుగు తెరకు పరిచయం చేశారు. 

బుచ్చిబాబు సానా (ఉప్పెన), పల్నాటి సూర్యప్రతాప్ (కుమారి 21 ఎఫ్), శ్రీకాంత్ ఓదెల (దసరా), అర్జున్ వైకే (ప్రసన్న వదనం), దర్శకుడు (హరిప్రసాద్ జక్కా), వేమారెడ్డి (చక్కిలిగింత).. వీళ్లంతా సుకుమార్ శిష్యులే. తన అసిస్టెంట్లలో మెరికలను ఎంచుకుని, వారి కథలను ఓకే చేసి సినిమాలు సెట్ చేయడం.. ఇదొక నిరంతర ప్రక్రియగా మారింది సుకుమార్ సంస్థలో. ఈ కోవలోనే ఇంకో టాలెంటెడ్ రైటర్‌ను సుకుమార్ దర్శకుడిగా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.

పుష్ప, పుష్ప-2 చిత్రాలకు రచనా విభాగంలో కీలక పాత్ర పోషించిన వీరా కోగటం అనే రచయిత.. దర్శకుడు కాబోతున్నాడు. అతను చెప్పిన ఓ క్రైమ్ థ్రిల్లర్ కథకు సుకుమార్ పచ్చ జెండా ఊపారు. యూత్‌ పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించే స్టోరీ ఇదని సమాచారం. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో లీడ్ రోల్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘కే రాంప్’ సినిమాను పూర్తి చేసి ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రీకరణకు రెడీ అవుతున్నాడు కిరణ్. ఆ సినిమా అవ్వగానే వీరా దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నాడు కిరణ్. సుకుమార్ ఓకే చేసిన కథ కావడం.. నేపథ్యం కొత్తగా ఉండడంతో పాటు కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యే స్టోరీ కావడంతో కిరణ్ ఈ సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. 

ఈ చిత్రాన్ని సుకుమార్ అన్న కొడుకు అశోక్ బండ్రెడ్డి, ‘లిటిల్ హార్ట్స్’తో మంచి విజయాన్నందుకున్న వంశీ నందిపాటి కలిసి నిర్మిస్తున్నారు. త్వరలోనే సుకుమార్ రైటింగ్స్ నుంచి అధికారికంగా ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించనున్నారు. దీంతో పాటు సుకుమార్.. హేమంత్ అనే మరో కొత్త దర్శకుడి కథకూ ఓకే చెప్పారు. కొత్త వాళ్లు నటించే ఆ సినిమాను కూడా సుకుమారే సెట్ చేసి పెడుతున్నారు. ‘పుష్ప-2’ తర్వాత సుకుమార్.. రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రతి సినిమా తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకుని తన శిష్యులను దర్శకులుగా మార్చే పనిలో పడతారు. ఈసారి కూడా అదే చేస్తున్నారు. దీంతో సమాంతరంగా తన సొంత సినిమాకు కథను సిద్ధం చేసే పని కూడా జరుగుతోంది.