మళ్లీ రీమేక్ తో రిస్క్ చేయబోతున్న సీనియర్ హీరో?

రీమేక్ సినిమాలంటే జనాలకు పూర్తిగా వ్యతిరేక భావం వచ్చేసిన రోజులు ఇవి. ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల సినిమాలనూ అందరూ చూసేస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్ల నుంచి రీమేక్స్ వర్కవుట్ కావడం లేదు. ఒక సినిమా రీమేక్ అని తెలియగానే.. దాని విశేషాలన్నీ బయటికొచ్చేస్తున్నాయి. జనం ఒరిజినల్ చూసేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో డిస్కషన్లు పెట్టేస్తున్నారు. దీంతో కథ పరంగా ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఒరిజినల్ చూడని వాళ్లు కూడా రీమేక్ అనగానే లైట్ తీసుకుంటున్న పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి నుంచి.. యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ వరకు గత కొన్నేళ్లలో రీమేక్‌లు ట్రై చేసిన వాళ్లందరూ ఎదురు దెబ్బలు తిన్నవాళ్లే. రీమేక్ చేయడం తప్పన్న నిర్ణయానికి వచ్చిన వాళ్లే.

అయినా సరే.. కొందరు హీరోలు మాత్రం ఆ ప్రయత్నాలు మానట్లేదు. టాలీవుడ్లో అత్యధిక రీమేక్‌ల్లో నటించిన హీరోల్లో ఒకరైన రాజశేఖర్.. హిట్టు కోసం మళ్లీ వేరే భాష సినిమా మీద ఆధారపడ్డట్లు సమాచారం. తమిళంలో పెద్ద హిట్టయిన ‘లబ్బర్ పందు’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారట రాజశేఖర్. ఇది గ్రామీణ క్రికెట్ చుట్టూ తిరిగే సినిమా. ఒరిజినల్లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేస్తున్నారట. పిట్టగోడ, 35 చిత్రాల్లో హీరోగా నటించిన విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడట.

రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్‌గా కనిపించనుందట. ఐతే ఒకప్పుడు రాజశేఖర్ రీమేక్ సినిమాలతోనే మంచి విజయాలు అందుకున్న మాట వాస్తవం కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలతో ఆయన చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ లాంటి చిత్రాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఈ అనుభవాల తర్వాత కూడా ఆయన మళ్లీ ఈ రిస్క్ ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. అందులోనూ ‘లబ్బర్ పందు’ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో మన ఆడియన్స్ బాగానే చూశారు. ఇలాంటి సినిమాను రీమేక్ చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అన్నది సందేహమే.