ఇంకో అయిదు రోజుల్లో ఓజి ముంచుకొస్తోంది. తమ ఫైనల్ రన్ కు ఈ వీకెండ్ ఒకటే ఆధారం కావడంతో మిరాయ్, కిష్కిందపురి ఆశలన్నీ శని ఆదివారాల కలెక్షన్ల మీద పెట్టుకున్నాయి. పూర్తి నిశ్చింతగా ఉన్నది లిటిల్ హార్ట్స్ టీమ్ ఒక్కటే. ఎందుకంటే రెండో రోజే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. నార్త్ అమెరికాలో 1 మిలియన్ మార్కు అందుకున్న ఈ స్మాల్ వండర్ హీరో మౌళికి ఒక అరుదైన మైలురాయిని అందించింది. డెబ్యూతోనే ఈ ఘనత అందుకున్న తొలి కథానాయకుడిగా ప్రత్యేక స్థానం ఇచ్చింది. గ్రాస్ ఇప్పటికే ముప్పై అయిదు కోట్లు దాటేయగా సోమవారానికి నలభై టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కు రెండు రకాల భరోసాలున్నాయి. ఒకవేళ ఓజి బ్లాక్ బస్టర్ అయిపోయి ప్రేక్షకులంతా దాని మేనియాలో పడిపోతే థియేటర్ అగ్రిమెంట్లు ముగించేసుకుని ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ చేసేయొచ్చు. లేదూ అంటే తిరిగి పుంజుకోవచ్చు. ఎలాగూ ఈటీవీ విన్ నిర్మాత కాబట్టి ఓటిటి డేట్ ని ఇష్టం వచ్చినప్పుడు నిర్ణయించుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. ఇంత సౌలభ్యం ఉండటం వల్లే అక్టోబర్ 2 లిటిల్ హార్ట్స్ డిజిటల్ వచ్చేస్తుందనే ప్రచారాన్ని ఈటీవీ తేలిగ్గా కొట్టేయగలిగింది. ఇప్పటికీ వీకెండ్స్ లో ఈ సినిమాకు మంచి హోల్డ్ ఉండటం గమనించాల్సిన విషయం.
ఎలా చూసినా ఓజి మేనియాని తట్టుకుని నిలవడం అంత సులభమైతే కాదు. ఏపీ తెలంగాణలో అత్యధిక శాతం థియేటర్లు పవన్ సినిమాకే ఇచ్చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ మీద ఫ్యాన్స్ భరోసాగా ఉన్నారు. మెయిన్ సెంటర్స్ లో మాత్రం కొన్ని స్క్రీన్లు లేదా షోలు మిరాయ్, కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ కు కేటాయించబోతున్నారు. తాజాగా వచ్చిన రిలీజుల్లో దేనికీ యునానిమస్ టాక్ రాలేదు. బ్యూటీ టీమ్ కొంచెం హడావిడి చేస్తోంది కానీ కలెక్షన్లు కనిపించడం లేదు. భద్రకాళి ఫ్లాపుల లిస్టులోకి చేరిపోవడం ఖాయమే అంటున్నారు. ఈ పరిణామాలన్నీ లిటిల్ హార్ట్స్ కు మేలు చేసేవే.
Gulte Telugu Telugu Political and Movie News Updates