క్రేజీ సీక్వెల్ ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ‘కల్కి’లో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన దీపిక.. పార్ట్-2 నుంచి తప్పుకోవడం అంటే ఆ సినిమాకు అన్ని రకాలుగా చాలా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ అనివార్య పరిస్థితుల్లోనే ఆమెను ‘కల్కి-2’ టీం తప్పించాల్సి వచ్చిందని స్పష్టమవుతోంది.
‘కల్కి’తో పోలిస్తే తన పారితోషకంలో 25 శాతం హైక్ అడిగిందని.. రోజుకు 7 గంటలే పని చేస్తానని కండిషన్స్ పెట్టిందని.. తన స్టాఫ్ 25 మందికి వసతి సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసిందని.. ఈ నేపథ్యంలోనే తప్పక ఆమెకు ‘కల్కి-2’ టీం టాటా చెప్పిందని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ‘కల్కి-2’ టీం నుంచే ఈ డిమాండ్ల గురించి సమాచారం లీక్ అయిందన్నది స్పష్టం. దీనికి దీపిక నుంచి ఏం సమాధానం వస్తుందా అని అందరూ ఎదురు చూశారు.
కానీ ‘కల్కి-2’లో తాను లేని విషయం మీద దీపిక అసలు స్పందించనే లేదు. అసలీ విషయమే పట్టనట్లు సైలెంట్‌గా ఉండిపోయింది. ఆమె ఇప్పుడు వేరే పోస్టుతో తన సోషల్ మీడియా ఫాలోవర్లను పలకరించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో ఆమె తన కొత్త సినిమా చేయబోతోంది. అదే.. కింగ్. ‘పఠాన్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించనున్న చిత్రమిది.
దీని గురించి ఆమె స్పందిస్తూ.. ‘‘18 ఏళ్ల కిందట షారుఖ్‌తో ఓం శాంతి ఓం చేసినపుడు ఆయన్నుంచి ఒక పాఠం నేర్చుకున్నా. సినిమా మేకింగ్‌ను ఆస్వాదించు, సక్సెస్ కంటే సినిమా ద్వారా కలిసే వ్యక్తులే ముఖ్యం. దీన్ని నేను ఎప్పుడూ అంగీకరిస్తా. అందుకే షారుఖ్‌తో నా ఆరో సినిమా చేస్తున్నా’’ అని దీపిక పేర్కొంది. ఐతే ఈ పోస్టులో ‘కల్కి-2’ టీం మీద సెటైరేమైనా ఉందా అని వెతుకుతున్నారు నెటిజన్లు. ‘కల్కి’ పెద్ద సక్సెస్ అయినప్పటికీ.. దాని కంటే తనకు వ్యక్తులే ముఖ్యం అంటూ ఆ సినిమాను పక్కన పెట్టి, షారుఖ్‌తో జట్టు కట్టడం గురించి ఆమె ఇలా ప్రస్తావించిందా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
Gulte Telugu Telugu Political and Movie News Updates