ఏదైనా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడని నిర్మాత బండ్ల గణేష్ కున్న పేరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నిర్మాణం, నటన రెండింటికీ దూరంగా ఉండటంతో నోటికి ఉన్న కాసిన్ని ఫిల్టర్లు కూడా తీసేశారు. నిన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ మరోసారి దాన్ని ఋజువు చేసింది. హీరో మౌళిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏదో స్టార్ అయ్యావని ఫీల్ కావొద్దు, విజయ్ దేవరకొండ బట్టలు ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, ఇవన్నీ అబద్దాలు, ఇంకో శుక్రవారం వస్తే మరో మౌళి వస్తాడు, నువ్వు మాత్రం చంద్రమోహన్ లాగా చనిపోయే దాకా సినిమాల్లో నటించడమే లక్ష్యంగా పెట్టుకోమని హితవు పలికారు.
టోన్ కాస్త బోల్డ్ గా అనిపించినా బండ్ల గణేష్ చెప్పిన దాంట్లో బోలెడు నిజాలున్నాయి. ఎందుకంటే సక్సెస్ మీద నడిచే పరిశ్రమలో ఏదైనా విజయం ఉన్నంత వరకే విలువ దక్కుతుంది. అది లేనప్పుడు పాతాళం వైపు అడుగులు పడతాయి. దాన్ని తట్టుకుని నిలవడం అంత సులభం కాదు. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీ హిట్ చూసిన ఒక డెబ్యూ హీరో తర్వాత వరస ఫ్లాపులతో పరిశ్రమకు దూరమై నాలుగు పదుల వయసు దాటాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అదే టైంలో పుట్టుకొచ్చిన మరో యూత్ సెన్సేషన్ కథల ఎంపికలో చేసిన తప్పులతో పాటు కుటుంబ సమస్యల వల్ల ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు.
వీళ్లకు ఎవరూ అండగా నిలవలేదు. ఎవరి కెరీర్ వాళ్ళదని వదిలేశారు. బండ్ల గణేష్ స్పీచ్ లో పరమార్ధం కూడా ఇదే. ఏదో సినిమా ఆడుతున్న ఊపులో ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు ప్రతిరోజు పక్కన ఉంటారని కాదు. ఒక డిజాస్టర్ పడితే దూరమయ్యే వాళ్లే ఎక్కువ. మౌళి ఇది ఆకళింపు చేసుకోవాలి. లేదంటే ఎంత త్వరగా ఇమేజ్ వచ్చిందో అంతే వేగంగా రిస్క్ లో పడుతుంది. బండ్ల గణేష్ చెప్పింది ఎంత నిజాలే అయినా కొంచెం సాఫ్ట్ టోన్ లో చెప్పి ఉండాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అలా ఆచితూచి లెక్కలు వేసుకుని మాట్లాడితే ఆయన బండ్లన్న ఎందుకు అవుతారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates