ప్రవచనకర్తలు ఈ తరం సినిమాల పట్ల వ్యతిరేకత చూపిస్తారు.. వ్యంగ్యాస్త్రాలు విసురుతుతారు తప్ప.. వాటిని కొనియాడడం అరుదు. ఒకప్పటి స్థాయిలో గొప్ప సినిమాలు రావట్లేదన్నదే వారి అభిప్రాయంగా ఉంటుంది. అలాంటిది యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి రూపొందించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 8 వసంతాలు చిత్రంపై ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు ప్రశంసలు కురిపించారు. నేటి యువత ఈ సినిమా చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రేమ గురించి ఈ సినిమాలో గొప్పగా చెప్పారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రేమంటే శారీరక ఆకర్షణ కాదని.. మనసుకు సంబంధించిన విషయమని ఈ సినిమాలో చాలా బాగా చూపించారని ఆయనన్నారు. ప్రేమించిన వ్యక్తి మనతో కలిసి ఉన్నా.. దూరంగా ఉన్నా.. 8 వసంతాలు సినిమా చూడండి. ప్రేమంటే ఏంటో తెలుస్తుంది. నేను ఆ సినిమా చూశా.
ప్రేమంటే శారీక సౌఖ్యాలు, ఒకళ్ల గురించి ఒకరు గొప్పలు చెప్పుకోవడం కాదు. నిజమైన ప్రేమ మనస్సులో ఉంటుంది. మనిషిని ముట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు నిజంగా ప్రేమికుడైతే, ప్రేమికురాలైతే వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఒకసారి దేవదాసు సినిమా కూడా చూడండి. అందులో కూడా ప్రేమించిన వ్యక్తి బాగుండాలనే కోరుకుంటారు అని గరికపాటి ఒక ప్రవచన కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ వీడియోను 8 వసంతాలు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్‌లో పంచుకుంటూ గరికపాటికి కృతజ్ఞతలు చెప్పింది.
మలయాళ యువ నటి, మ్యాడ్ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రలో ఫణీంద్ర 8 వసంతాలు చిత్రాన్ని రూపొందించాడు. ఒక అమ్మాయి జీవితంలో వివిధ దశలను, తన ప్రేమ కథలను హృద్యంగా స్పృశిస్తూ ఈ సినిమా తీశాడు ఫణీంద్ర. ఐతే కమర్షియల్‌గా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఓటీటీలో రిలీజయ్యాక మాత్రం 8 వసంతాలుకు మంచి స్పందనే వచ్చింది. అనంతిక నటన, సినిమాటోగ్రఫీ, సంగీతం, డైలాగులకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు గరికపాటి లాంటి పండితుడు సర్టిఫికెట్ ఇవ్వడం టీంకు అమితాన్నందించేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates