దుల్కర్ సల్మాన్.. నష్టాలకు రెడీ అయితే

లోక.. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌లో ఓ సంచలనం. ఇండియాలో తొలి లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా అయిన ‘లోక’ మలయాళంలో మంచి అంచనాల మధ్య విడుదలై ఊహించని వసూళ్లు రాబట్టింది. రిలీజ్ రోజుకు మలయాళంలో మాత్రమే ఈ సినిమాకు హైప్ ఉంది. కానీ తర్వాత ఇతర భాషల్లోనూ ఈ చిత్రం అదరగొట్టడం మొదలుపెట్టింది. 

విడుదలైన మూడో వారంలోనూ ఈ చిత్రం నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ‘లోక’ వసూళ్లు రూ.250 కోట్లకు చేరువగా ఉన్నాయి. మలయాళ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్లలో ఈ చిత్రం రెండో స్థానానికి చేరుకుంది. ఈ సినిమాతో నిర్మాత దుల్కర్ సల్మాన్ మామూలు జాక్‌పాట్ కొట్టలేదు. ఐతే ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేస్తోంది కానీ.. విడుదలకు ముందు సరైన బిజినెస్ జరక్కపోవడంతో నష్టాలు తప్పవని మానసికంగా సిద్ధమైపోయాడట దుల్కర్.

‘లోక’ బడ్జెట్ రూ.30 కోట్లు. టాలీవుడ్లో అది పెద్ద బడ్జెట్ కాదు కానీ.. మార్కెట్ పరిధి తక్కువైన మలయాళంలో ఓ లేడీ ఓరియెంటెడ్ ఫిలిం మీద అంత ఖర్చు పెట్టడం సాహసమే. కాగా తాము అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు కావడం, లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం వల్ల బిజినెస్ అనుకున్నంత మేర జరక్కపోవడంతో ఈ సినిమాతో నష్టాలు తప్పవు అని దుల్కర్ అనుకున్నాడట. తన ప్రొడక్షన్లో తొలిసారిగా నష్టాలు ఎదుర్కోబోతున్నానని అతను మానసికంగా రెడీ అయిపోయాడట. సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కినా సరే.. వసూళ్లు పెద్దగా రావని అంచనా వేశాడట. 

కానీ ఈ చిత్రం ఇంతగా ప్రభావం చూపిస్తుందని.. రికార్డులు బద్దలు కొట్టేలా వసూళ్లు రాబడుతుందని అస్సలు ఊహించలేదని దుల్కర్ అన్నాడు. ఈ సక్సెస్ ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని అతనన్నాడు. ‘లోక’ దర్శకుడు ఈ కథను చాలామంది నిర్మాతలకు చెప్పగా.. ఎవ్వరూ లేడీ ఓరియెంటెడ్ మూవీ మీద బడ్జెట్ పెట్టడానికి ముందుకు రాలేదు. ఈ విషయం చెప్పి దర్శకుడు తన దగ్గర బాధ పడతుుంటే.. నన్నెందుకు నిర్మాతగా కన్సిడర్ చేయట్లేదు అని దుల్కరే ముందుకొచ్చి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం విశేషం.