థియేట‌ర్ల భ‌యాలు తొల‌గిపోయాయి

జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం త‌గ్గించేశారు.. స్టార్ల సినిమాల‌కు కూడా థియేట‌ర్లు ఖాళీ.. ఓటీటీల పోటీని త‌ట్టుకుని థియేట‌ర్ల వైపు జ‌నాల‌ను మ‌ళ్లించాలంటే క‌ష్ట‌మే.. ఇంకెంతో కాలం సింగిల్ స్క్రీన్లు నిల‌బ‌డ‌వు.. మ‌ల్టీప్లెక్సుల మ‌నుగ‌డ కూడా క‌ష్ట‌మే.. వ‌చ్చే వ‌సూళ్ల‌తో థియేట‌ర్ల‌ను మెయింటైన్ చేయ‌డ‌మే క‌ష్టం.. ఇక లాభాల గురించి ఎక్క‌డ ఆలోచించేది? థియేట‌ర్ల ఆదాయం అంత‌కంత‌కూ ప‌డిపోతుంటే.. ఇక సినిమాలు ఎలా తీస్తారు?  కొన్ని వారాల ముందు వ‌ర‌కు ఇదీ అనేక భ‌యాలు… అనేక సందేహాలు. కానీ కొన్ని వారాల వ్య‌వ‌ధిలో మొత్తం మారిపోయింది. వెండి తెర‌లు వెలిగిపోతున్నాయి.

సినిమా హాళ్లు జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోతున్నాయి. టికెటింగ్ వెబ్ సైట్లు, యాప్స్ ఫుల్ బిజీగా ఉంటున్నాయి. భాషా భేదం లేకుండా కంటెంట్ బాగుందంటే చాలు.. జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఇటు యూత్.. అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్.. బిగ్ స్క్రీన్ల‌లో బాగానే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని రుజువు చేస్తూ.. మ‌హావ‌తార న‌ర‌సింహా అనే చిన్న యానిమేష‌న్ సినిమా కొన్ని వారాల పాటు ఇర‌గాడేయ‌గా.. లిటిల్ హార్ట్స్ అనే మ‌రో చిన్న చిత్రం రెండో వారంలోనూ హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవ‌డం విశేషం.

సినిమా బాగుండి, టికెట్ల ధ‌ర‌లు అందుబాటులో ఉంటే.. స్టార్ల‌తో అస‌లు ప‌నే లేద‌ని.. ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాల‌ను ఆద‌రిస్తార‌ని ఈ చిత్రాలు రుజువు చేశాయి. ఇదే స‌మ‌యంలో లోకా అనే మ‌ల‌యాళ లేడీ ఓరియెంటెడ్ మూవీ అస‌లు ప‌బ్లిసిటీయే లేకుండా తెలుగులో రిలీజై.. మౌత్ టాక్‌తో జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించింది. ఇప్ప‌టికీ ఆ సినిమా బాగా ఆడుతోంది. ఇక గ‌త వీకెండ్లో మిరాయ్ సినిమాకైతే జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. టాప్ స్టార్ల సినిమాల స్థాయిలో అది థియేట‌ర్ల‌ను జ‌నాలతో క‌ళ‌క‌ళ‌లాడించింది.

మ‌రోవైపు కిష్కింధ‌పురికి సైతం మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్ప‌టికీ ఆ సినిమా వ‌సూళ్లు స్ట‌డీగా ఉన్నాయి. డెమాన్ స్లేయ‌ర్ అనే జ‌ప‌నీస్ యానిమేష‌న్ సినిమాను కూడా మ‌న యూత్ ఎగ‌బ‌డి చూస్తున్నారు. తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో సంద‌డి చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కొన్ని వారాల ముందు వ‌ర‌కు వెల‌వెల‌బోయిన థియేట‌ర్లు ఇప్పుడు జ‌నాల‌తో నిండుగా కనిపిస్తుండ‌డంతో వాటి భ‌విష్య‌త్తు ప‌ట్ల భ‌యాలు తొల‌గిపోతున్నాయి.