మూడో భారతీయుడు బయటికి రాలేడా

కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్టర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న భారతీయుడు 2కి కొనసాగింపు ఇండియన్ 3 ఎప్పటికీ బయటికి వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని చెన్నై మీడియాలో జోరుగా వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ బ్యాలన్స్ ఉన్న షూటింగ్ పూర్తి చేయడానికి ఎక్కువ బడ్జెట్ డిమాండ్ చేస్తున్నారట. దానికి నిర్మాణ సంస్థ లైకా సుముఖంగా లేదు. ఇంకో వైపు కమల్ హాసన్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో పాటు ఇతర హీరోలతో రాజ్ కమల్ బ్యానర్ మీద వరసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. శంకర్ ఏమో వేల్పరి స్క్రిప్ట్ ని తుదిమెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నారు.

ఎవరికి వారు తలో దిక్కు వెళ్ళిపోతే ఇండియన్ 3 భవిష్యత్తు ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి సగానికి పైగానే పార్ట్ 3 ఇంతకు ముందే పూర్తి చేశారు. వాటి విజువల్స్ నే ట్రైలర్ గా కట్ చేస్తే అభిమానులకు నచ్చింది. కానీ బాకీ ఉన్న భాగానికి డబ్బులు లేకపోవడం అసలు సమస్య. పైగా థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. డిస్ట్రిబ్యూటర్లు ముందు నష్టాలను భర్తీ చేయమంటారు. ఇంకో వైపు నెట్ ఫ్లిక్స్ కూడా సుముఖంగా లేదట. ఇన్నేసి ప్రతికూలతలు చుట్టుముడితే గుమ్మడికాయ కొట్టే మార్గం ఎక్కడుంటుంది. అందుకే ఈ డోలాయమానం.

ఒకవేళ ఇదంతా నిజమే అయితే 1996లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ క్లాసిక్ కు తీరని అవమానం జరిగినట్టే. కమల్ కు కూడా ఒక మచ్చలా మిగిలిపోతుంది. గతంలో ఆయన కెరీర్ లో మరుదనాయగం, శభాష్ నాయుడు లాంటివి కొంచెం షూట్ అయ్యాక ఆగిపోయాయి కానీ ఇండియన్ 3 అలా కాదు. అంతకన్నా ఎక్కువే చిత్రీకరణ జరుపుకుంది. ఇదంతా తేలకపోతే కనీసం యూట్యూబ్ లో ఆ ఫుటేజ్ ని ఫ్రీగా వదలమని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఎక్కడైనా మీడియా ఈ సినిమా ప్రస్తావన తెచ్చినా కమల్ దాటవేసి తప్పించుకుంటున్నారు.