బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్‌కు సౌత్ సినిమాల మీద మంచి గురే ఉంది. బాహుబలి:ది బిగినింగ్ సినిమా చేయబోయే అద్భుతాలను ముందే గ్రహించి ఆ చిత్రాన్ని హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ చేసి గొప్ప ఫలితాన్ని రాబట్టాడు కరణ్. తర్వాత బాహుబలి: ది కంక్లూజన్ ఇంకెంత సంచలనం రేపిందో తెలిసిందే. ఆ తర్వాత ఆచితూచి సౌత్ సినిమాలను హిందీలో రిలీజ్ చేసి మంచి ఫలితాలు రాబట్టాడాయన. 2.0, ఘాజి, దేవర.. ఇలా కరణ్ హిందీలో తన ధర్మ ప్రొడక్షన్స్ బేనర్ మీద విడుదల చేసిన సినిమాలన్నీ సానుకూల ఫలితాలే రాబట్టాయి.
ఆయన కొంచెం గ్యాప్ తర్వాత తెలుగు నుంచి పిక్ చేసుకున్న కొత్త చిత్రం.. మిరాయ్. ఇది పెద్ద స్టార్ నటించిన సినిమా కాకపోయినా.. ప్రోమోలు చూసి ఇంప్రెస్ అయ్యి హిందీలో విడుదల చేయడానికి ముందుకు వచ్చాడు కరణ్. కన్నడ, తమిళం, మలయాళంలోనూ పేరున్న బేనర్లే ఈ సినిమాను రిలీజ్ చేశాయి. అన్ని చోట్లా సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నప్పటికీ హిందీలో మిరాయ్ రేంజ్ వేరుగా ఉంటుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
తేజ సజ్జ చివరి సినిమా హనుమాన్.. నెమ్మదిగా మొదలుపెట్టి హిందీలో భారీ వసూళ్లు రాబట్టింది. మిరాయ్ తొలి రోజు దాన్ని మించే స్పందన తెచ్చుకుంది. కోటిన్నర దాకా హిందీలో గ్రాస్ రాబట్టిందీ సినిమా. రెండో రోజుకు వసూళ్లు రెట్టింపు అయినట్లు హిందీ ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. హిందీ ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎగబడరు. కంటెంట్ బాగుంటే నెమ్మదిగా ధియేటర్లకు వస్తారు. వాళ్లను మిరాయ్ ఆకట్టుకుందని ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది.
డివైన్ ఎలిమెంట్స్‌ను సరిగ్గా ప్రెజెంట్ చేస్తే అక్కడి జనం ఊగిపోతారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, హనుమంతుడు లాంటి పురాణ పురుషుల పాత్రలను బాగా చూపిస్తే ఆ సినిమాలకు ఎంతో ఆదరిస్తారు. హనుమాన్, కార్తికేయ-2 ఇలాగే వాళ్లను మెప్పించాయి. మిరాయ్‌లో రాముడి పాత్రతో కనెక్షన్ పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. ఇక హిందీ ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడానికి ఏముంది? ఈ సినిమాకు హిందీలో లాంగ్ రన్ ఉంటుందని.. కరణ్ జోహార్ మరోసారి తెలుగు నుంచి ఇంకో జాక్ పాట్ కొట్టినట్లే అని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates