ఈ మధ్య కాలంలో అత్యంత హైప్‌తో రిలీజై.. ఆ హైప్‌ను కనీస స్థాయిలో కూడా మ్యాచ్ చేయలేని సినిమా అంటే ‘కూలీ’నే అని చెప్పాలి. ప్రోమోలతో ఏవేవో భ్రమలు కల్పించిన లోకేష్ కనకరాజ్.. తన కెరీర్లోనే అత్యంత అర్థరహితమైన కథాకథనాలతో తీవ్ర నిరాశకు గురి చేశాడు. కథలో.. సన్నివేశాల్లో ఏమాత్రం లాజిక్ లేకుండా సాగిన ఈ చిత్రంలో ఒక్కటంటే ఒక్క పాత్రతోనూ ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. బోలెడన్నిసార్లు నరేషన్ విని మరీ ఈ సినిమాకు సంతకం చేసిన నాగ్.. అసలేం చూసి సైమన్ పాత్రను ఓకే చేశాడన్నది అర్థం కాలేదు.
హీరో రజినీకాంత్, స్పెషల్ రోల్ చేసిన ఉపేంద్ర.. ఇలా అందరి పాత్రలూ అంతంతమాత్రమే. ఇక చివర్లో స్పెషల్ క్యామియో చేసిన ఆమిర్ పాత్ర అయితే ఈ సినిమాలో ఎందుకు ఉందో.. దాని పరమార్థమేంటో ఎవ్వరికీ అంతుబట్టలేదు. ‘విక్రమ్’లో రోలెక్స్ రేంజ్ క్యారెక్టర్ అంటూ దీని గురించి బిల్డప్ ఇచ్చారు. కానీ అందులో పదో శాతం ఇంపాక్ట్ కూడా వేయలేకపోయిందా పాత్ర.
ఐతే ప్రేక్షకులు ఈ పాత్ర గురించి విమర్శించడం కాదు.. స్వయంగా ఆమిర్ ఖానే అదొక వేస్ట్ క్యారెక్టర్ అని తేల్చేసినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజినీకాంత్ సినిమా కావడంతో కథ, తన పాత్ర గురించి ఏమీ వినకుండా ఈ సినిమా ఒప్పుకున్నట్లు ఆమిర్ ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆ విషయమే చెబుతూ.. అసలు తన పాత్ర సినిమాలో ఎందుకుందో అర్థం కాలేదని.. ఆ పాత్రకు ఏ పర్పస్ లేదని.. కూలీ సినిమా చేయడం పెద్ద తప్పు అని ఆమిర్ అన్నట్లుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
దీనికి సంబంధించి ఒక న్యూస్ క్లిప్పింగ్ కూడా వైరల్ అవుతోంది. ఈ కామెంట్లు చర్చనీయాంశంగా మారడంతో అందరూ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ను మరో రౌండ్ ఆడుకుంటున్నారు. కానీ ఈ న్యూస్ ఫేక్ అంటూ అమీర్ ఖాన్ పర్సనల్ టీం వివరణ ఇచ్చింది. ఆమిర్ ఎక్కడా కూలీలో తన పాత్ర గురించి మాట్లాడలేదని.. సినిమా మీద విమర్శలు గుప్పించలేదని.. ఈ ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని అతని టీం స్పష్టం చేసింది. ఐతే ఆమిర్ ఆ కామెంట్లు చేయకపోయినా.. ఆయన అలా అనదగ్గ స్థాయి పాత్రే తనది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates