ఓజి VS కాంతార – ఎవరికి రిస్కు

టాలీవుడ్ బాక్సాఫీస్ మరో బిగ్గెస్ట్ క్లాష్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25 విడుదల కానున్న ఓజికి, అక్టోబర్ 2 వస్తున్న కాంతార చాప్టర్ వన్ కి కేవలం వారం గ్యాపే ఉండటం బయ్యర్లను కొంచెం టెన్షన్ కు గురి చేస్తోంది. హీరోల ఇమేజ్ కోణంలో చూసుకుంటే రిషబ్ శెట్టి ఏ విధంగానూ పవన్ కళ్యాణ్ కు సమఉజ్జి కాడనేది వాస్తవం. కానీ వ్యక్తిగతంగా తన కన్నా కాంతార బ్రాండ్ మీదున్న క్రేజ్ మార్కెట్ లో మాములుగా లేదు. తెలుగు హక్కులు వంద కోట్ల దాకా అమ్ముడుపోవచ్చనే టాక్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సెన్సేషన్ అయ్యింది. అదే నిజమైతే మాత్రం అంతకు రెట్టింపు గ్రాస్ రూపంలో రాబట్టాల్సి ఉంటుంది.

పైకి చూస్తే ఏడు రోజుల నిడివి సరిపోతుందని అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్ గా చూసుకుంటే ఎవరి రిస్కులు వాళ్లకు ఉన్నాయి. ఓజికి కనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పెంచిన టికెట్ రేట్లతో వారం పది రోజులు దున్నేస్తుంది. తగ్గాక చూద్దామని ఎదురు చూస్తున్న సాధారణ మాస్ ప్రేక్షకులకు అక్టోబర్ 2 నుంచి కాంతార రూపంలో ఇంకో ఛాయస్ తోడవుతుంది. ఎంత కన్నడ డబ్బింగ్ అయినా సరే క్రేజ్ దృష్ట్యా దీనికి కెజిఎఫ్ రేంజ్ హైప్ వస్తుందని ముందస్తు అంచనాలున్నాయి. అలాంటప్పుడు ఓజికి కొంత పోటీ తప్పదు. అయినా సరే పవన్ మేనియా దాన్ని ఈజీగా తట్టుకుంటుంది. ఒకవేళ టాక్ కొంచెం అటుఇటు అయితేనే సమస్య.

ఇక కాంతార వైపు చూస్తే అంత రేట్ పెట్టి డబ్బింగ్ హక్కులు కొన్నప్పుడు భారీ ఎత్తున థియేటర్లు అవసరమవుతాయి. ఓజి సూపర్ హిట్ అయితే రెండో వారం థియేటర్ అగ్రిమెంట్లు యథావిధిగా కొనసాగుతాయి. అప్పుడు కాంతారకే రిస్కు. దసరా సీజన్ కాబట్టి రెండు సినిమాలకు స్కోప్ ఉంటుంది కానీ రికార్డుల మీద కన్నేసిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ కనీసం ఒక పది రోజుల పాటు బలమైన కాంపిటీషన్ ఉండకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాంతార జస్ట్ వన్ వీక్ కి వస్తే కలెక్షన్లు పంచుకోవాల్సి వస్తుంది. వాయిదా పడొచ్చని ఆశపడ్డారు కానీ వెనుకడుగు లేదని కాంతార బృందం ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది.