అమరన్ హీరోది పెద్ద సాహసమే

తెలుగులో అంతకు ముందు ఏమో కానీ అమరన్ రూపంలో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడ్డాక శివ కార్తికేయన్ కు ఇక్కడ కూడా మార్కెట్ ఏర్పడింది. అందుకే పెద్దగా హైప్ లేకపోయినా మదరాసిని మంచి రేట్లకే అమ్మారు. సినిమా ఫ్లాప్ కావడం వేరే విషయం. ఏడాది గ్యాప్ తీసుకుని మూవీ చేస్తే ఇలాంటి ఫలితం దక్కడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఇతని కొత్త చిత్రం పరాశక్తి జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అయితే కోలీవుడ్ లో ఈ అనౌన్స్ మెంట్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే పండగ బరిలో విజయ్ జన నాయగన్ ఉంది కాబట్టి.

పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న జన నాయగన్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందుకే తనతో క్లాష్ వద్దు లెమ్మని సూర్య, విక్రమ్ లాంటి హీరోలు పోటీకి దిగే రిస్క్ చేయడం లేదు. కానీ శివ కార్తికేయన్ మాత్రం సై అంటూ సవాల్ విసరడం తమిళ సీమలో హాట్ టాపిక్ అయ్యింది. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్న విజయ్ కు పోటీగా మరో సినిమా వస్తోందంటే ఉదయనిధి స్టాలిన్ చేతిలో ఉన్న రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ మద్దతు ఆటోమేటిక్ గా పరాశక్తికి వస్తుంది. దీంతో థియేటర్ల విషయంలో టెన్షన్ పడనక్కర్లేదని ట్రేడ్ పండితుల అంచనా.

ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. పరాశక్తికి తెలుగులోనూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ శ్రీలీల, సుధా కొంగర దర్శకత్వం, పీరియాడిక్ సెటప్ లాంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లు పండగ బరిలో నువ్వా నేనాని తలపడబోతున్నారు. వీళ్ళలో ఒకరో ఇద్దరో తప్పుకున్నా కాంపిటీషన్ అయితే టఫ్ గా ఉంటుంది. స్క్రీన్లు కూడా సరైన సంఖ్యలో దొరకవు. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య పరాశక్తి బ్లాక్ బస్టర్ కన్నా తక్కువ ఫలితం అందుకుంటే నిర్మాతలకు నష్టమే. దశాబ్దాల క్రితం జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో పరాశక్తి రూపొందింది.